– టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ
వేద న్యూస్, మరిపెడ:
నైజాం పాలకుల అక్రమాలు, నిరంకుశత్వాన్ని ఎదిరించేందుకు ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించిన కవి దాశరథి, పత్రికా రచయిత షోయబుల్లా ఖాన్ మానుకోట ప్రాంత వాసులు అని టీయూడబ్ల్యుజే (ఐజేయూ) ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అన్నారు. వారి బాటలో, వారి అడుగుజాడల్లోనే ఈ ప్రాంత జర్నలిస్టులు ప్రశ్నించే తత్వాన్ని పునికి పుచ్చుకొని వారికి ప్రతీకగా నిలుస్తున్నారని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడకేంద్రంలో శనివారం మరిపెడ టీయుడబ్ల్యూజే (ఐజేయూ) కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో విరాహత్ అలీ మాట్లాడుతూ ప్రజా చైతన్య స్ఫూర్తిదాతలైన దాశరథి, షోయబుల్లా ఖాన్ పుట్టిన మట్టి వాసనతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మానుకోట ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. టీయుడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం 65 ఏళ్లుగా పోరాడుతూనే, మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. మీడియాలో కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో స్వేచ్ఛగా జర్నలిస్టులు చివరకు ఎడిటర్ల కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. యాజమాన్యం చేప్పిన విధంగానే వార్తలు రాయాల్సి వస్తోందని, ఎడిటోరియల్ కు బదులుగా ప్రొప్రోయిటల్ గా మారిపోయాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా పేరుతో అధికంగా మీడియాలో పెడదోరణి పెరిగిపోయిందని, న్యూసెన్స్ మీడియాగా మారిందని, జర్నలిజం పవిత్రతను కాపాడేందుకు చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
పెడ దోరణికి వ్యతిరేకంగా జర్నలిస్టులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన జర్నలిస్టుల సంక్షేమానికి, జర్నలిస్టుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఆశించిన రీతిలో చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులందరిని బిపిఎల్ గా గుర్తించి ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విరాహత్ అలీ విజ్ఞప్తి చేశారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడు దాసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మండలస్థాయి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీయూడబ్ల్యూజే నని గుర్తుచేశారు. వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నందుకు, సామాజిక స్పృహ, న్యాయ సంబంధమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టులకు తగిన గుర్తింపు లేదని, కనీసం రాష్ట్ర సచివాలయంలోకి వెళ్లేందుకు కూడా జర్నలిస్టులకు అనుమతి లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులకు హక్కుల కల్పన నామ మాత్రంగా మారిందని, జర్నలిస్టుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపించారు. సంఘటితంగా ముందుకు సాగుతూ జర్నలిజాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్టులకు గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరు చేయడంతో పాటు ఇంటి స్థలం కేటాయించిన కు కృషి చేస్తామని చెప్పారు. మరిపెడ మున్సిపాలిటీలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించడంలో జర్నలిస్టులను ప్రజలు దేవుళ్ల కంటే ఎక్కువగా నమ్ముతారని చెప్పారు. సమాజ మార్పు కోసం జర్నలిస్టులు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, వృత్తి నైపుణ్యం ఎందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, ‘జర్నలిస్టు బంధు’ పథకం అమలు చేయాలని, ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాలని జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా హర్షద్వానాలతో ప్రతినిధులు ఆమోదించారు. కార్యక్రమంలో కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ గౌడ్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండి సంపత్ కుమార్, గుంటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు షోయబుల్లాఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఇటీవల దివంగతులైన జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టులు మరణించగా వారి ఆత్మ శాంతికి మౌనం పాటించారు.