వేద న్యూస్, మరిపెడ:
సీతారాంపురం ఉన్నత పాఠశాలను డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రును పాఠశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో 109 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. మొత్తంగా 450 మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నారని వివరించారు. పదో తరగతి గది లోకి వెళ్లి, వారు ఎలా చదువుతున్నారో ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు కావలసిన వసతులను గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.
తదుపరి విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులంతా కూడా కష్టపడి చదివి, మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. పరీక్షల కు ప్రిపేర్ కావడం కోసం పదవ తరగతి విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్, ఎగ్జామ్ పాడ్స్ స్వయంగా అందజేస్తానని చెప్పారు. అందుకు ప్రధానోపాధ్యాయులు ఎమ్మెల్యేకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పాఠశాలను సందర్శించిన సమయంలో ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పిఆర్టియు క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. మరిపెడ మండల పిఆర్టియు మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రామ్ మోహన్ బయగాని, సునీల్ కుమార్, శంకర్, భూమా వెంకటేశ్వర్లు, సురేష్, ఉపాధ్యాయులు విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.