– రాష్ట్రప్రభుత్వ పథకాల వైఖరిపై జనసేన పార్టీ విమర్శ
– వ్యవస్థలో మార్పు కోసం జనసేన వైపు చూడండి
– ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మేరుగు శివ కోటి యాదవ్
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి..పథకాల ప్రచారంలో ఆర్భాటం ఎక్కువగా ఉందని, అమలులో, ఆచరణలో తక్కువ అన్నట్లుగా ఉందని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మేరుగు శివ కోటి యాదవ్ అన్నారు. శనివారం ఆయన నర్సంపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చే పథకాల అమలులో తీరుపై ప్రజలందరిలో చైతన్యం రావాలని కోరారు. కేవలం ఎన్నికల ముందు ఓట్ల కోసమే అన్నట్లుగా ప్రభుత్వ పథకాల హడావిడి, తమ పార్టీ కండువా కప్పుకున్న వారికే పథకాలకి అర్హులు అన్నట్లుగా అధికార పార్టీ నేతల వ్యవహార శైలి ఉందని తెలిపారు. పూర్తిస్థాయిలో అర్హులందరికీ నోచని ‘దళిత బంధు’, ‘గృహలక్ష్మి’, ‘బీసీ రుణాలు’, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాలు, ఆసరా పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. లబ్ధిదారులందరికీ మేలు జరగడం లేదని ఆరోపించారు. తమ హక్కుగా పొందే ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు పంచేందుకు అధికార ప్రజా ప్రతినిధులకు చేతివాటం ఎందుకని ప్రశ్నించారు. లబ్ధిదారుల నుంచి రూ.వేలల్లో, లక్షల్లో వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రశ్నించే తత్వం లేకపోతే బానిసత్వమే కొనసాగుతుంది
పథకాల సంపూర్ణంగా అమలు చేయడంలో జాప్యం ఎందుకని అడిగారు. ఓట్ల కోసం ఎన్నికల ముందు కొద్దిమందికే పథకాల చెక్కులు ఇచ్చి ఎన్నికల కోడ్ రాగానే వాటిని ఆపివేసి కాలయాపనం చేసే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఉందని మేరుగు వెల్లడించారు. ఉదాహరణకు గృహలక్ష్మీ పథకం ద్వారా సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షలు సరిపోనప్పటికీ అది కూడా మూడు విడతల్లో ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే సంప్రదాయ పార్టీలకి మద్దతు తెలుపుతున్నంతకాలం సంపూర్ణభివృద్ధికి నోచుకోలేరని వివరించారు. ప్రజల్లో చైతన్యం రావాలని కోరుతూ..ప్రశ్నించే తత్వం లేనిచోట బానిసత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వ్యవస్థలో మార్పు కోసం, అవినీతి నిర్మూలన దిశగా, ప్రజలకు సుపరిపాలన అందించే లక్ష్యంతో నూతనంగా ముందుకు వస్తున్న తమ జనసేన పార్టీ వైపు కూడా ప్రజలు ఒకసారి చూడాలని, ఆలోచించాలని కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజవర్గంలో మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామనీ, ప్రజలందరికీ సేవకులుగా ఉంటూ అండగా నిలుస్తామని పేర్కొన్నారు.