- జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ రాజశేఖర్
వేద న్యూస్, జమ్మికుంట:
దేశం సైన్స్ తోనే పురోగమిస్తుందని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజశేఖర్ అన్నారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంటలో బుధవారం సైన్స్ డిపార్ట్ మెంట్ వారు నోబెల్ అవార్డు గ్రహీత సి.వి. రామన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని, దానికి కారణం సైన్స్ అని కొనియాడారు.
పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతీ చోట సైన్స్ దాగి ఉందని, విద్యార్థులు నిశితంగా పరిశీలన చేసి ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలని సూచించారు. అలా అయితేనే సైన్స్ రంగంలో రాణించగలుగుతారని తెలిపారు. రసాయన శాస్త్రాధ్యాపకులు ఎడమ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సైన్స్ అంటే భౌతికంగా నిరూపించబడేదని కావున విద్యార్థులు మూఢవిశ్వాసాలను విడనాడాలని, గుడ్డిగా దేనిని నమ్మరాదు అని సూచించారు. ప్రాచీన కాలం నుంచి కంప్యూటర్ యుగం వరకు సైన్స్ దాగి ఉందని వెల్లడించారు. సరైన విద్య లేక ఆనాటి ప్రజలకు అది సైన్స్ అని తెలియలేదని వివరించారు.
ఆధునిక కాలంలో సైన్స్ పట్ల అవగాహన పెరిగి సైన్స్ వల్లే ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతోందని, అందువల్ల సైన్స్ కు బాగా ప్రాధాన్యత పెరిగిందని స్పష్టం చేశారు. ఆధునిక కాలంలో ప్రపంచంలో కృత్రిమ మేథ ద్వారా సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు.
కళాశాల లైబ్రేరియన్ ఎ. భీమారావు మాట్లాడుతూ ఈ సంవత్సరం సైన్స్ నినాదం “వికసిత భారత్ సాంకేతిక స్వయం సమృద్ధి” అని తెలిపారు. భారతదేశం సాంకేతిక రంగంలో ఇతర దేశాల మీద ఆధారపడకుండా సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తోందని చెప్పారు. చంద్రయాన్ ప్రయోగం ద్వారా చంద్రమండలం దక్షిణ ధ్రువానికి చేరిన మొదటి దేశంగా భారత్ కీర్తి గడించిందని గుర్తుచేశారు.
2025లో ప్రయోగించే ‘గగనయాన్’ ప్రయోగంలో సాంకేతికంగా ఏ దేశం మీద ఆధారపడకుండా సొంత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంతరిక్షానికి మన వ్యోమగాములను పంపుతున్నారని..తద్వారా మన దేశం అగ్రదేశాల సరసన నిలబడుతుందని తెలిపారు.
విద్యార్థులు కొత్త, కొత్త ఆవిష్కరణలు చేసి దేశాన్ని అభ్యుదయ మార్గంలో పయనింపచేయాలని సూచించారు. సైన్స్ కు సంబంధించిన అనేక విషయాల మీద సైన్స్ అధ్యాపకులు వి .స్వరూప రాణి, డాక్టర్ టి. శ్రీలత, ఎన్. మమత, ఎల్. రవీందర్, రమేష్, అరుణ్, ప్రశాంత్, రవి ప్రకాష్, డాక్టర్. ఎం బడి రవి, విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎం. రామ్మోహన రావు, రేణ ఈశ్వరయ్య, డాక్టర్ బి.సువర్ణ, టీఎస్ కె సి మెంటర్ ఆర్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు