– చింతలపల్లి ఎంపీపీఎస్ హెచ్ఎం భిక్షపతి
వేద న్యూస్, ఎల్కతుర్తి:
విద్యార్థులకు ఆట, పాటలతో విద్యను అందిస్తున్నట్లు చింతలపల్లి ఎంపీపీఎస్ హెచ్ఎం రామంచ భిక్షపతి తెలిపారు. ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామ ఎంపీపీఎస్‌లో సెప్టెంబర్ నెల చివర శనివారం రోజున ‘నో బ్యాగ్ డే’ నిర్వహించారు. రాష్ట్రసర్కార్ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల విద్యా సామర్థ్యాల మెరుగుపర్చడంలో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతీ నెల చివరి శనివారం రోజున ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని విద్యాశాఖ తెలిపింది.
ఆ కార్యక్రమంలో భాగంగా చింతలపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం తాము చదివిన గ్రంథాలయ పుస్తకాల నుంచి కథలు చెప్పారు. విద్యార్థులు తమ వాక్ పటిమను అధిగమించారు. పలు రకాల ఆటలు ఆడారు. ‘ఒరిగామి’ పేపర్ క్రాఫ్ట్ ద్వారా వివిధ రకాల టోపీలను స్వయంగా తయారు చేసి తమ తోటి విద్యార్థులకు ఇచ్చారు.
అలా హాయిగా ఆనందంగా ఆటలాడారు. నెభ్రూ టోపి, ముస్లిం టోపి, గ్రాండ్యుయేషన్ డే టోపీలు తయారు చేసుకుని వాటిని స్నాతకోత్సవంలో పట్టాలు పొందిన మాదిరిగా ధరించి సంతోషం వ్యక్తం చేశారు. అభ్యసనా ద్వారా సామర్థ్యాలను మెరుగు పర్చుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రామంచ భిక్షపతి, ఉపాధ్యాయులు దామెర పద్మ, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.