• రాష్ట్రప్రభుత్వ తీరు శోచనీయం
  • జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్
  • నేనూ ప్రైవేట్ టీచర్‌గా పని చేసి..మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చా
  • ‘జనంతో జనసేన’లో ప్రైవేట్ టీచర్ల మద్దతు కోరిన మెరుగు శివకోటి
  • ప్రైవేట్ టీచర్లకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు అయినా ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా రాష్ట్రప్రభుత్వం నిర్వహించపోవడం శోచనీయం అని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ విమర్శించారు. ఆయన శనివారం “జనంతో జనసేన” కార్యక్రమంలో భాగంగా నర్సంపేట పట్టణంలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రైవేట్ టీచర్ల మద్దతు కోరి, వారి సమస్యలు తెలుసుకుని స్పందించారు. తాను కూడా ఒక ప్రైవేట్ టీచర్ గా వృత్తి చేపట్టి పని చేశానని, మీలో నుంచి ఒకడిగా తాను బయటకు వచ్చి వ్యవస్థలో మార్పు కోసం అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు నడుస్తున్నానని స్పష్టం చేశారు. నియోజవర్గంలో జనసేన చేసిన ఎన్నో ప్రజాసేవ, పోరాట కార్యక్రమాలను చేశామని, మీ అందరి మద్దతు తప్పకుండా ఉంటుందని తాను ఆశిస్తున్నానని శివకోటి యాదవ్ తెలిపారు. ‘నీళ్లు, నిధులు, నియామకాల’ త్రయనినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వేలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా కాని 9 ఏళ్ల నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా నిర్వహించకపోవడం సరికాదని చెప్పారు. ప్రస్తుతం వయసు పెరిగిన దృష్ట్యా అనేకమంది ప్రైవేట్ టీచర్లు ఉద్యోగ నోటిఫికేషన్ లకు అనర్హులుగా మిగిలిపోయారని స్పష్ం చేశారు. ప్రభుత్వం ఉద్యోగం పొందాలనే వాళ్ల ఆశలన్నీ ఆవిరి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు హెల్త్ కార్డులు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, 12 నెలలకు వేతనాలు ఇవ్వాలనే ప్రైవేట్ టీచర్ల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మెరుగు అన్నారు. ప్రైవేట్ టీచర్లకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ అండగా నిలుస్తుందని హామీనిచ్చారు.

కరోనా సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడితే తక్షణ సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రైవేట్ టీచర్ల రాస్తారోకోలకి జనసేన పార్టీ మద్దతుగా నిలిచి పోరాటం చేసిందని గుర్తుచేశారు. తద్వారా ప్రభుత్వం స్పందించి నెలకు సరిపడు నిత్యవసర వస్తువులకు, కొంత ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ చేసిందని వివరించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజవర్గంలో జనసేన పార్టీ “గాజు గ్లాసు” గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రైవేట్ టీచర్లను కోరారు. ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నర్సంపేట మండల అధ్యక్షుడు వంగ మధు, ప్రధాన కార్యదర్శి ఓర్సు రాజేందర్, కార్యవర్గ సభ్యులు అందే రంజిత్, బొబ్బ పృథ్వీరాజ్, గద్దల కిరణ్, పోషాల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.