తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో సాధించాలనే కలలతో గ్రూప్-1 పరీక్షల కోసం కష్టపడుతున్నారు. కానీ వారి జీవితాలను గాలికొదిలేసి.. ఒక పక్క సమయంవృధా చేసి రూ. లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ పాలకుల నిర్లక్ష్యం వలన
ఘోర తప్పిదాలు గతంలోనూ ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి.
గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజ్, సమయపాలన లోపం, నిర్వాహకాల్లో అనుభవం లేకపోవడం వల్ల పరీక్షలు అనేకసార్లు రద్దవ్వడం చూశాం. విద్యార్థులపై ప్రభావం పడినప్పటికీ ప్రభుత్వానికి చింత లేదు. అది ప్రజా పరిపాలన కాదు, నియంతృత్వం నిర్లక్ష్య పాలన.అని అట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చి
ఫాంహౌస్ పంపించారు
ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే బాటలో నడుస్తోందా అనే అనుమానం నిరుద్యోగుల్లో మొదలైంది. ఏకంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫిర్యాదుల నేపథ్యంలో జి.ఓ నంబర్ 29 రద్దు చేయాలని
55 జి.ఓ అమలు చేసి group1 పరీక్షలు నిర్వహించాలని నిరసనలు మధ్య ఎగ్జామ్స్ నిర్వహించారు కానీ
ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియం పేపర్ వాల్యుయేషన్ లో గందరగోళం ఇలా హై కోర్ట్ లో కేసులు
రికాల్ చేయడం, ఆపై ఫైనల్ షెడ్యూల్ మీద అస్పష్టత – ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తును ఒక ప్రయోగశాలగా మార్చేశాయి.
ప్రత్యక రాష్టం లో కూడా దశాబ్ద కాలం గడిచినా, ఒక్క గ్రూప్ 1 పరీక్షను కూడా పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించుకోలేకపోయిన ప్రభుత్వం – పాలన పట్ల ఉన్న నిర్లక్ష్యం అశ్రద్ధకు నిదర్శనం.
1. 2016 గ్రూప్ 2 – నోటిఫికేషన్ & రద్దుల గోల:
వేలాది అభ్యర్థులు జీవితాలను అర్థాంతరంగా ఆపి, సమయం, డబ్బు, మానసిక శక్తిని ఖర్చు చేసి ఎదురుచూస్తే – పరీక్షల తేదీల మార్పులు, హాల్ టిక్కెట్లు లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, న్యాయపోరాటాలు… ఇవే మిగిలినవు.
2. గ్రూప్ 1 (2022-2024) – వ్యవస్థల విలయం:
TSPSC చేత నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పూర్తిగా నిందల ముసుగులో అయిపోయింది. ఓసారి OMR బబుల్స్ వల్ల, మరోసారి పేపర్ లీక్ అనుమానాలు, ఆపై కోర్టులో విచారణ, ఈ మార్జిన్‌లో పలు ప్రభుత్వ నిర్ణయాలు అభ్యర్థులకు అవమానంగా మారాయి.
3. నాటి,నేటి పాలకుల వైఫల్యం – ఎలాంటి మార్పు లేక పాత పాటే!
పాత ప్రభుత్వం తప్పు చేసిందని కొత్త ప్రభుత్వం చెప్పుకుంటోంది. కాని న్యాయం చేసిన విధానం ఏది?
పాత ప్రభుత్వం ఆరోపణలకు గురైతే, ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది.
“తెలంగాణవాళ్లకు అడ్మినిస్ట్రేషన్ రాదు” అన్న ఆంధ్ర పాలకుల మాటలు నిజమవుతున్నాయా అనే అనుమానం వచ్చేటంత పని జరుగుతోంది.
అభ్యర్థులకు ప్రశ్నలు – ప్రభుత్వానికి సమాధానాలున్నాయా?
– పరీక్షలు ఎందుకు లీకవుతున్నాయి?
– ప్రతిసారీ OMR బబుల్స్, టెక్నికల్ లోపాలేనా కారణం?
– ఎలాంటి అదనపు భద్రతా వ్యవస్థలు లేకుండా పరీక్షల నిర్వహణ ఎందుకు?
– బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితాలు:
– అభ్యర్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
– కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది.
– విద్యార్థులు ఇతర ప్రైవేట్ నోటిఫికేషన్ల వైపు వెళుతున్నారు.
– ప్రభుత్వ నైపుణ్య వ్యవస్థపై నమ్మకం తగ్గుతోంది.
తీర్మానం – ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది నిరుద్యోగుల భవిష్యత్తు కోసం పోరాటం.
– గ్రూప్ పరీక్షలు బలమైన, పారదర్శక వ్యవస్థ ద్వారా జరగాలి.
– అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో చిత్తశుద్ధి ఉండాలి.
– అధికారుల నిర్లక్ష్యం మూలంగా వచ్చిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
– అభ్యర్థులకు ఖచ్చితమైన, తేలికైన పరిష్కార మార్గాలు చూపాలి.
తెలంగాణ గడ్డ – పోరాటాల గడ్డ. విద్యార్థుల జీవితాలతో ఆటలాడే పాలకులను చరిత్ర క్షమించదు.
ఇప్పటికైనా రాజకీయ లాభాలకోసం పరీక్షలతో రాజకీయం చేయడం మానేయాలి.
యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది.
– పాలడుగు శ్రీనివాస్, విద్యార్థి ఉద్యమ నాయకుడు , ఉస్మానియా విశ్వవిద్యాలయం