వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
విద్యానగర్ కాలనీ (టి. బి ఆసుపత్రి వెనుక), విజయ గణపతి మందిరం, హన్మకొండ నివాసి డాక్టర్ ముక్తవరపు చక్రధర్.. ఆయన తండ్రి కీ.శే. శ్రీరాములు(విజయ గణపతి దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు) వర్ధంతి సందర్భంగా మంగళవారం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం చేయాలనే ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. రెండేండ్ల కిందట కరోనా సమయంలో ఇదేరోజు మరణించిన తన నాన్న కీ.శే రాములు ఎన్నో సేవా కార్యక్రమాలను చేసేవారని గుర్తుచేసుకున్నారు.

తన తండ్రికి శరీరదాన ఆశయం ఉండేదని కానీ, కరోనా వల్ల మెడికల్ కాలేజీ వారు నిరాకరించడంతో ఆయన కోరిక నెరవేర్చకపోయామనే బాధ మిగిలిపోయిందని చెప్పారు. ఆయన బాటలో నడవాలనే సత్సంకల్పంతో తాను, తన భార్య రమాదేవి, కుమారుడు కృష్ణతేజ నేత్రదానం చేయుటకు ముందుకు వచ్చి అంగీకార పత్రాలపై సంతకాలు చేశామని చక్రధర్ తెలిపారు. సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుకోవళ్లూరు శ్రవణ్ కుమార్ కు అంగీకార పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఐడీ కార్డులు, అభినందన పత్రాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

సమాజహిత నిర్ణయం తీసుకున్న కీ.శే.శ్రీరాములు కుమారుడు డాక్టర్ చక్రధర్, భార్య రమాదేవి, కుమారుడు కృష్ణతేజ‌ను కాలనీ‌లోని విజయ గణపతి సేవా సేవాసమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ NVN చారి, అధ్యక్షులు పాండురంగారావు, కార్యదర్శి గద్దె నర్సయ్య, కోశాధికారి కట్టా ప్రకాశ్ చారి, కార్యవర్గం, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, “పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక” నాయకులు కాజీపేట పురుషోత్తం, పగళ్లపాటి రాజ్ కుమార్, పిట్టల రవిబాబు అభినందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.