వేద న్యూస్, కోరుట్ల:
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకవి, సినీగీత రచయిత తిరునగరి శరత్ చంద్రకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా అందించింది. అక్టోబర్ 31న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన 83 వ స్నాతకోత్సవంలో భాగంగా అడోబ్ ఇంక్ ..యూఎస్ఎ చైర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత శంతన్ నారాయణ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

2017 లో ఆచార్య సూర్యాధనంజయ్ గారి పర్యవేక్షణలో ‘దాశరథి సినిమాపాటల్లో కవితాత్మకత’ అనే అంశంపై పిహెచ్‌డిలో చేరిన శరత్ చంద్రకు 2022 నవంబర్ లో విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఈ స్నాతకోత్సవంలో పట్టానందించింది.

ఎం.ఏలో యూనివర్సిటి టాప్ వచ్చినందుకు 2019 లో అప్పటి రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. కవిగా రెండు కవితాసంపుటాలు ప్రచురించిన శరత్ చంద్ర దాదాపు 50 కి పైగా సినిమాపాటలు రాశారు. డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా శరత్ చంద్రను కుటుంబ సభ్యులు, తెలంగాణ సాహితి మిత్రులు అభినందించారు.