- పంచాయతీ కార్యదర్శుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు అశోక్
- జిల్లా ఫోరం కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు
- కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లనున్నట్టు వెల్లడి
వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు జనుగానీ అశోక్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి చర్చించి, ఆ సమస్యలను టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని తీర్మానాలు చేశారు.
హనుమకొండ జిల్లాలోని 10 జీపీల పంచాయతీ సెక్రెటరీలకు బీఎల్వో డ్యూటీలు వేశారని, వెంటనే ఆ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శులకు పని భారం తగ్గించాలన్నారు. గ్రామ పంచాయతీలకు వెంటనే ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని జీపీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ లో పంచాయతీ సెక్రెటరీలను బాధ్యులను చేయకూడదన్నారు. వారికి ఎలాంటి జరిమానా విధించకూడదని వెల్లడించారు.
మస్టర్ నిర్వహణలో పంచాయతీ సెక్రెటరీలను బాధ్యులను చేయకూడదని, వారి సంతకం అవసరం లేకుండా ఎఫ్ ఏ, టీఏ సంతకాలతో పేమెంట్ చేయాలని సూచించారు. నాలుగేండ్లు పూర్తయిన జేపీఎస్ లను అందరినీ ప్రొబేషన్ తో సంబంధం లేకుండా రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఆ నాలుగేండ్ల కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలన్నారు. ఓపీఎస్ లను జేపీఎస్ లుగా నియమించాలని కోరారు. ఇక ముందు ఓపీఎస్ నియామకం చేపట్టకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ అంశాలపై తీర్మానాలు చేశారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేశ్, అసోసియేట్ అధ్యక్షుడు వెంకటేశం, కోశాధికారి రాజు, ఉపాధ్యక్షులు వెంకన్న,ఆర్గనైజింగ్ కార్యదర్శి అర్శం శ్రీనివాస్, హనుమకొండ డివిజన్ అధ్యక్షులు ఎం.డీ. రఫీ, పరకాల డివిజన్ అధ్యక్షుడు మనోహర్, సభ్యులు భీం రాజ్, వేణుమాధవ్, రఘు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.