వేద న్యూస్, సుల్తానాబాద్:
ఓదెల మల్లికార్జున స్వామి ని సోమవారం కుటుంబ సమేతంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వేద వాయిద్యాలతో, పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో బొడ్క సదయ్య, ఆలయ డైరెక్టర్లు, ఎమ్మెల్యేకు స్వామీ వారీ ప్రతిమను బహూకరించి స్వామి వారి ప్రసాదాన్ని అందించారు.

ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఓదెల మల్లిఖార్జున స్వామి వారి దేవస్థాన అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామి వారిని వేడుకున్నానని చెప్పారు.

అనంతరం ఎల్లమ్మతల్లి, శివాలయం, రామాలయ దేవాలయాలను సందర్శించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.