- ఆసక్తికరంగా పరకాల రాజకీయం
- తెరపైకి బీసీ నినాదంతో..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు
- సేవాభావం కలిగిన బలమైన నేతగా రవికృష్ణ గౌడ్‌కు గుర్తింపు
వేద న్యూస్, పరకాల:
‘మేమెంత ఉన్నామో మాకన్ని సీట్లు ఇవ్వాల్సిందే’ అని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ‘బీసీ నినాదం-బహుజనవాదం’ రాష్ట్రరాజకీయాల్లో తెరమీదకు వచ్చింది. దాంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఆ విషయమై కసరత్తు చేస్తున్నట్లు కనబడుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 22 మంది బీసీలకు టికెట్లు కేటాయించగా, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు బీసీలను తమై వైపునకు తిప్పుకునేందుకు ప్రణాళికలను రచించుకుంటున్నాయి.
బలమైన బీసీ నేతలకు కొన్ని నియోజకవర్గాలకు టికెట్లు ఇవ్వడం ద్వారా బీసీ వర్గాల ఓట్లు తమకు బలంగా మారుతాయనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ బీసీ వర్గాలకు కేటాయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణగౌడ్ పేరు తెరమీదకు రాగా, ఆయన పేరును ఈ కోణంలో పరిశీలిస్తున్నట్లు వినికిడి. ఈ మేరకు ఆయనతో ఆ పార్టీ నేతలు సైతం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
మారుతున్న రాజకీయం
ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా గురించి అగ్రనేతలతో పార్టీ సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో బీసీ వర్గాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలనే వాదనలూ నేతలు చేస్తున్నారు. దాంతో పార్టీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దించితే ఏ మేరకు ప్రభావం చూపగలరనే అంశాన్ని సైతం పరిశీలించినట్లు టాక్ వినబడుతోంది.
బీసీ వర్గాలకు టికెట్ ఇస్తే జనం మద్దతును సులభంగా కూడగట్టుకోవచ్చనే అంచనాకు సైతం అధిష్టానం వచ్చినట్లు సమాచారం. సుమారు దశాబ్ద కాలంగా బీసీ వర్గాల హక్కుల కోసం, సంక్షేమం కోసం నిత్యం పోరాడుతున్న నాయకుడిగా బైరి రవికృష్ణగౌడ్‌కు ప్రజల్లో చక్కటి గుర్తింపు ఉంది. ఇటీవల గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించిన ‘గౌడ గర్జన సభ’తో బైరి తన సత్తాను మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు. తన జాతి కోసం ఎంతటి చిత్తశుద్ధితో పని చేయగలనో అనేది చేసి చూపించారు.
సామాజిక సేవలోనూ ముందంజ
బైరి రవికృష్ణగౌడ్ సామాజిక సేవలోనూ ముందుంటారు. సేవాభావంతో ప్రజల కోసం పలు కార్యక్రమాలు చేపట్టిన బైరికి ఉన్న క్లీన్ ఇమేజ్‌తో పాటు ఇటీవల చేపట్టిన గౌడ సంఘాల జేఏసీ సభ ద్వారా రవికృష్ణ గౌడ్ బైరి పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలనలోకి తీసుకున్నట్లు వినికిడి. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్ల కేటాయింపు ఉంటుందనే సంకేతాన్ని బైరి రవికృష్ణ గౌడ్‌ను పోటీ చేయించడం ద్వారా బలంగా ప్రజల్లోకి పంపే అవకాశాలు ఉంటాయని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓట్ల సమీకరణ సులభమే!
కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 34 సీట్లు బీసీ వర్గాలకు కేటాయించాలని డిసైడ్ అయినట్లు ప్రకటనలు వచ్చాయి. ఆ క్రమంలో పరకాల నియోజకవర్గంలో బీసీ నేతగా ఉన్న రవికృష్ణగౌడ్ ను అభ్యర్థిగా బరిలో దించితే గెలుపు ఏ మేరకు సాధ్యమనే విషయమై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా వెల్లడవుతోంది. తాను టికెట్ ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలతో బైరి రవికృష్ణ గౌడ్ చర్చల సందర్భంలో తెలిపారు. పరకాల నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గ ఓట్లు 35 వేలకు పై చిలుకు ఉండగా, బీసీలలోని ఇతర సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సైతం సమీకరణలో బైరి రవికృష్ణగౌడ్‌కు తోడయ్యే అవకాశాలు మెండుగానే ఉంటాయని బైరి వర్గీయులు చెప్తున్నారు.
టికెట్ కోసం పోటాపోటీ
పరకాల కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు వస్తుందని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొండా మురళి సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధిష్టానం అవకాశమిస్తే తాను పరకాల బరిలో నిలిచి అధికార పార్టీ ఎమ్మెల్యేను ఓడిస్తానని అంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బైరి రవికృష్ణ గౌడ్ సైతం కాంగ్రెస్ పరకాల టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో పరకాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా పరకాల కాంగ్రెస్ టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. అధిష్టానం పోటీలో నిలిచిన వారిలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో పడినట్లు కనబడుతోంది. బీసీలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజల తరఫున సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తే నేతగా గుర్తింపు పొందిన రవికృష్ణగౌడ్ బైరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలుండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. గత పదేండ్లుగా బహుజనుల కోసం పోరాటాలు చేస్తూ బహుజనుల నాయకుడిగా రవికృష్ణగౌడ్ పేరు సంపాదించుకున్నారు.
రవికృష్ణగౌడ్ ప్రజాప్రస్థానం
హన్మకొండ ప్రశాంతి నగర్‌కు చెందిన బైరి రవికృష్ణ గౌడ్ బీసీ సంఘం నేతగా చక్కటి గుర్తింపు పొందారు. తన జాతి ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. బహుజనవాదాన్ని బలంగా తీసుకెళ్లగలిగే నాయకుడు బైరినేనని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవులు చేపట్టిన బైరి.. అంచెలంచెలుగా ఎదిగారు. 2022 నుంచి బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటు పడాలనే ఉన్నత ఆశయంతోనే రాజకీయ రంగప్రవేశం దిశగా బైరి రవి కృష్ణ గౌడ్ అడుగులు వడివడిగా వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను పరకాల కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్లు బైరి పేర్కొన్నారు. చూడాలి మరి..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరికి ఎవరికి ఆశీస్సులు అందిస్తుందో..
ప్రొఫైల్:
పూర్తి పేరు: బైరి రవికృష్ణగౌడ్
పుట్టిన తేదీ: 06-02-1966
చదువు: గ్రాడ్యుయేషన్
తల్లిదండ్రులు: బైరి సుశీల-బాలయ్య
కుటుంబం: సతీమణి-శారద
పిల్లలు: కూతురు, కొడుకు
చిరునామా: ప్రశాంతినగర్, హనుమకొండ