వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :
నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలోని భీమారం రోడ్డు మార్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రానికి స్థలం లేకపోవడంతో రైతులు వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తున్నారు. దీంతో ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పోలీసులు రైతులకు విజ్ఞప్తులు చేసిన గాలికి వదిలేశారు. శుక్రవారం రాత్రి భీమారం రోడ్డు మార్గంలో రోడ్లపై ఆరబోసిన ఓ రైతు వరి ధాన్యం కుప్పలో 12 క్వింటాల ధాన్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. శనివారం ఉదయం స్థానిక ఎస్సై శివతేజ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజ్ ల ఆధారంగా వరి ధాన్యం కుప్పలో దొంగిలించిన దుండగులను గాలించి పట్టుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ధాన్యాన్ని దొంగిలించిన వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ధాన్యాన్ని దొంగిలించిన వారి వద్ద 12 క్వింటాలా ధాన్యాన్ని రికవరీ చేస్తామని చెప్పారు.