వేద న్యూస్, మెదక్:
జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 63వ హోమ్ గార్డ్స్ రైసింగ్ డే పరేడ్‌లో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోమ్ గార్డ్స్ సిబ్బందికి రైసింగ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. హోమ్ గార్డ్స్ వ్యవస్థ 1946లో ముంబై వరద విపత్తులో కీలక సహాయక చర్యల్లో పాల్గొనడం ద్వారా ప్రారంభమై, అప్పటి నుంచి దేశవ్యాప్తంగా శాంతి-భద్రతల పరిరక్షణలో విశిష్టమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం 142 మంది హోమ్ గార్డ్స్ సిబ్బంది వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలు, కమ్యూనిటీ పోలీసింగ్, పండుగల బందోబస్తు, ఎన్నికల సమయంలో భద్రతా బాధ్యతలు వంటి కీలక రంగాల్లో హోమ్ గార్డ్స్ పాత్ర అపూర్వమని ఎస్పీ ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోమ్ గార్డ్స్ సిబ్బందికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయాలను ఎస్పీ వివరించారు. డ్యూటీ అలౌన్సు రూ.921 నుండి రూ.1000కు పెంచినట్లు, ట్రాఫిక్‌లో పనిచేసే సిబ్బందికి అదనంగా 30 శాతం అలౌన్సు అందుతున్నట్లు తెలిపారు. పరేడ్ అలౌన్సును రూ.100 నుండి రూ.200కు పెంచడం జరిగిందని వెల్లడించారు. అలాగే ఈ సంవత్సరం విధి నిర్వహణలో మరణించిన శివరాం, మహేందర్ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పోలీస్ శాఖ తరఫున సాయం అందించినట్లు చెప్పారు.
వర్షాకాలం, శీతాకాలాల్లో సిబ్బంది సౌకర్యార్థం వూలెన్ జాకెట్లు, రెయిన్కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా తనకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు.
హోమ్ గార్డ్స్ రైసింగ్ డే సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలైన సిబ్బందికి ఎస్పీ బహుమతులు ప్రదానం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందిని ప్రశంసిస్తూ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్, డియస్పి లు సుభాష్ చంద్ర బోస్, నరేందర్ గౌడ్, ప్రసన్న కుమార్, రంగా నాయక్ సీఐ లు, జర్జ్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, మహేష్, కృష్ణ మూర్తి, శైలేందర్, రామకృష్ణ, ఎసై లు సిబ్బంది పాల్గొన్నారు.