- బీసీ కోటా కింద మంత్రివర్గంలో చోటు!
- రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పార్టీ పెద్దలతో ప్రభాకర్‌కు సత్సంబంధాలు
వేద న్యూస్, హుస్నాబాద్ ప్రతినిధి:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి అందరికీ విదితమే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే రాష్ట్ర సీఎం కాబోతున్నారని తెలుస్తోంది. సీఎల్పీ నేతగా ఎన్నికైన నాయకుడు, మంత్రివర్గ కూర్పుపైన సమావేశంలో చర్చించనున్నారు. కాగా, ఏర్పడబోయే మంత్రివర్గంలో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మంత్రి పదవి వరించబోయే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. దాదాపు 20 వేల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్ కుమార్ పై గెలుపొందారు. హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే గెలుపు తమదేననే భావించే కేసీఆర్ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు.
ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ కు మంత్రి వర్గంలో స్థానం కల్పించే దిశగా ఆలోచనలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివాదరహితుడు, సౌమ్యుడు, జనానికి అందుబాటులో ఉండే నాయకుడిగా, సీనియర్ కాంగ్రెస్ నేతగా పేరొందిన పొన్నం ప్రభాకర్ పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు టాక్. బహుజనవాదిగా, బడుగు, బలహీన వర్గాల గొంతుకగా, బీసీ నాయకుడిగా ప్రజల్లో ఉన్న పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి తప్పనిసరిగా ఇస్తారని ఆయన వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో పెప్పర్ స్ప్రేకు గురైన నాయకుడిగా, ప్రజల తరఫున కొట్లాడే మనిషిగా పొన్నం ప్రభాకర్ కు పేరుంది.
తన మాటల తూటలతో ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు విమర్శలను తిప్పికొట్టే వాగ్దాటి పొన్నం ప్రభాకర్ సొంతం. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో పొన్నం ప్రభాకర్ కు సత్సంబంధాలున్నాయి. పార్లమెంట్ సభ్యుడిగా పని చేసిన సమయంలో యాక్టివ్ గా ప్రజల పక్షాన పలు విషయాలపై మాట్లాడిన పొన్నం ప్రభాకర్ పట్ల జాతీయ స్థాయి నాయకులకూ అంచనా ఉండే ఉంటుంది. కాగా, ఇవన్నీ కూడా ఆయనకు కలిసొచ్చే అంశాలేనని చెప్పొచ్చు.
విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ లో కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్..ఉమ్మడి ఏపీలో మార్క్ ఫెడ్ చైర్మన్ గా చేశారు. 2009-2014 వరకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా(లోక్ సభ) పని చేశారు. ప్రత్యేక రాష్ట్రసాధనలో కీలక భూమిక పోషించిన పొన్నంకు మంత్రి వర్గంలో చోటు కల్పించడం ద్వారా ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించినట్లవుతుందనే వాదనను పలువురు చేస్తున్నారు. దానికి తోడు బీసీ వర్గానికి చెందిన నాయకుడికీ అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే చర్చ కూడా సాగుతోంది.