- ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక
- బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రభాకర్ ప్రమాణస్వీకారం
- హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల హర్షం
వేద న్యూస్, హుస్నాబాద్/ఎల్కతుర్తి:
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాబినెట్ లో మంత్రి వర్గ సహచరుడిగా పొన్నం ప్రభాకర్ ప్రజలకు సేవలందించనున్నారు. కాగా, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రి కాబోతున్నారని ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ముందే చెప్పింది. ఈ నెల 6న ‘మినిస్టర్ రేసులో పొన్నం’ శీర్షికన ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. బీసీ కోటా కింద మంత్రివర్గంలో చోటు పొన్నంకు తప్పనిసరిగా ఉంటుందని ‘వేద న్యూస్’ తన కథనంలో ప్రస్తావించింది. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పార్టీ పెద్దలతో ప్రభాకర్‌కు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొంది.
వివాదరహితుడు, సౌమ్యుడు, జనానికి అందుబాటులో ఉండే నాయకుడిగా, సీనియర్ కాంగ్రెస్ నేతగా పేరొందిన పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. బహుజనవాదిగా, బడుగు, బలహీన వర్గాల గొంతుకగా, బీసీ నాయకుడిగా ప్రజల్లో ఉన్న పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఉద్యమనేతకు సముచిత స్థానం కల్పించినట్లయిందని పలువురు అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో పెప్పర్ స్ప్రేకు గురైన సంగతి అందరికీ విదితమే. ప్రజల తరఫున కొట్లాడే మనిషిగా పేరున్న పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.