– హుస్నాబాద్ నియోజకవర్గంలో దూసుకెళ్తున్న ప్రభాకర్
– ప్రజాబలమే ‘బలగం’గా..పార్టీ హామీలపై విస్తృత ప్రచారం
– తెలంగాణ ఏర్పాటు కోసం లోక్‌సభలో పోరాడిన చరిత్ర
– ఉమ్మడి ఏపీ సీఎంనూ ఎదిరించిన దమ్మున్న లీడర్ పొన్నం
– రాష్ట్రం కోసం ఉద్యమకారుడిగా సొంతపార్టీపైనే తిరుగుబాటు
– కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకే దాదాపుగా కన్ఫర్మ్!

వేద న్యూస్, హుస్నాబాద్/ఎల్కతుర్తి:
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడకపోవడం..తనను నమ్ముకున్న వారిని కాపాడుకోవడం..ప్రజాప్రయోజనాలే పరమావధిగా భావించి..లక్ష్యసాధనలో ప్రత్యర్థులు ఎంతటి వారైనా వారిని ఎదిరించడం..అవసరమైతే చివరికి సొంత పార్టీపైనే తిరుగుబాటు చేయడం..ప్రజల మేలు కోసం పని చేయడం..ఇదీ సంక్షిప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యక్తిత్వం..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి..లోక్‌సభలో సమైక్యవాదుల పెప్పర్ స్ప్రే దాడికి గురై లోక్ సభలో స్పీకర్ తెలంగాణ బిల్ పాస్ చేసేలా చేయడంలో తన వంతు పాత్రను పోషించిన ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కోసం పార్లమెంటు‌లో కొట్లాడిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రభాకర్. ఆనాడు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలన్నిటినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు మద్దుతు కూడగట్టడంలో కృషి చేసిన వ్యక్తుల్లో ఒకరు.

పెప్పర్ స్ప్రే దాడిలో కంటికి బలమైన గాయమైనా తెలంగాణ ఏర్పాటు కోసం పోరాటంలో వెన్ను చూపని నేత. ఉమ్మడి ఏపీలో సీఎం స్థాయి వ్యక్తిని సైతం ఎదిరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డు పడొద్దని బహిరంగంగానే హెచ్చరించిన దమ్మున్న లీడర్, ఉద్యమనేత పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దన్నుగా నిలిచిన పొన్నం..రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ప్రజాక్షేమం కోసం పాటు పడాలని భావిస్తున్నారు.

హుస్నాబాద్ బరిలో పొన్నం
రెండు సార్లు కరీంనగర్ అసెంబ్లీకి, రెండు సార్లు కరీంనగర్ లోక్ సభకు పోటీ చేసిన పొన్నం ప్రభాకర్..ఈ సారి అనూహ్యంగా తను పోటీ చేయబోయే స్థానం మార్చారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలవాలనే నిర్ణయం తీసుకున్న పొన్నం..ఆ దిశగా కార్యచరణను వెంటనే షురూ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గకేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుతో పాటు నియోజకవర్గ జనంలోకి బలంగా వెళ్తున్నారు. ప్రజల ఆదరాభిమానాలు, విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ఎస్‌యూఐ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులుగా..మార్క్ ఫెడ్ చైర్మన్ గా, కరీంనగర్ ఎంపీగా పొన్నం పని చేశారు.

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న పొన్నం ప్రభాకర్..ఏఐసీసీ ముఖ్య నేతల అనుమతితో తెలంగాణ అసెంబ్లీకి దరఖాస్తు చేసుకుంది మొదలు..హుస్నాబాద్ బరిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కరీంనగర్ పార్లమెంటు లోక్ సభ సభ్యునిగా, ఉద్యమకారుడిగా హుస్నాబాద్ ప్రజలకు సుపరిచితమైన పొన్నం..ఈ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని ఏ మేరకు చూరగొంటారో తెలియాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. అయితే, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ పొన్నం ప్రభాకర్‌ కు దాదాపుగా కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. దరఖాస్తుల వడపోత అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు తయారు చేసిన 70 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాలో హుస్నాబాద్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పేరును పంపించినట్లు సమాచారం. త్వరలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో పొన్నం పేరు తప్పకుండా ఉంటుందని ఆయన అనుయూయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీసీ అభ్యర్థిగా బలమైన ప్రభావం!
హుస్నాబాద్ నియోజకవర్గ రాజకీయం రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న అధికార కారు పార్టీ స్పీడ్ కు బ్రేకులు వేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. పోటీ ప్రధానంగా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య త్రిముఖంగా ఉండబోతుందని తెలుస్తోండగా, ఈ క్రమంలోనే తెరపైకి వచ్చిన బీసీ నినాదం కూడా చర్చనీయాంశమవుతోంది. ఆ కోణంలో హుస్నాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులుగా సేవలందించిన వారిలో బీసీలు ఎంత మంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 1990వ దశకంలో రెండు సార్లు బీసీల ప్రాతినిథ్యం ఉండగా, ఆ తర్వాత కాలంలో బీసీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు కాలేదు. ఈ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించాలనే వాదనలు వినబడుతున్నాయి.

బీసీ అభ్యర్థికి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. ఆ విధంగా సామాజిక వర్గ సమీకరణలో బీసీ అంశం పొన్నం ప్రభాకర్‌కు కలిసొచ్చే అంశమే. దాంతో పాటు అధికారం ఉన్నా లేకపోయినా..పదవులతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, వారి కష్ట సుఖాల్లో కలిసి తోడుగా ఉండటం పొన్నం ప్రభాకర్ వ్యక్తిత్వంలో భాగమని పొన్నం వర్గీయులు చెప్తున్నారు. లక్ష్య సాధనకు తల వంచకుండా పని చేయడం..పొన్నం ప్రభాకర్ వ్యక్తిత్వమని ఆయన అనుయూయులు పేర్కొంటున్నారు.

తల తెగిపడ్డా సరే..ఎత్తిన తల దించకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం కృషి చేసే మనస్తత్వం..పొన్నం ప్రభాకర్ ది అని వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ..పార్టీ బలోపేతం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు జనంలోకి బలంగా తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న పొన్నం వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం దాదాపుగా పూర్తిగా మొగ్గు చూపుతున్నట్లు టాక్. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్ బరిలో దిగి హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదం పొందుతారని ఆయన వర్గీయులు అంటున్నారు. చూడాలి మరి..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరికి ఎవరికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తుందో..

ప్రొఫైల్:
పూర్తి పేరు: పొన్నం ప్రభాకర్
పుట్టిన తేదీ: 08-05-1967
స్వగ్రామం: మంకమ్మ తోట, కరీంనగర్
ప్రాథమిక విద్యాభ్యాసం: ధంగర్ వాడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కరీంనగర్
ఇంటర్మీడియట్: ప్రభుత్వ జూనియర్ కాలేజీ కరీంనగర్
డిగ్రీ:స్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కరీంనగర్
పీజీ: ఎం.ఏ.పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
ఎల్ఎల్‌బీ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
తల్లిదండ్రులు: పొన్నం మల్లమ్మ- సత్తయ్య గౌడ్(కీ.శే)
కుటుంబం: సతీమణి-మంజుల
కుమారులు: పృథ్వీ, ప్రణవ్