వేద న్యూస్, జమ్మికుంట:
హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తనను బీఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్టు పెద్దంపల్లి మాజీ సర్పంచ్ దొడ్డె శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఉత్తర్వులు జారీచేసినట్టు మంగళవారం పేర్కొన్నారు. జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దొడ్డె శ్రీనివాస్ 2007లో బహుజన సమాజ్ పార్టీలో చేరారు.
ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా, హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా, ఇన్ చార్జిగా పనిచేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పనిచేస్తానని, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో అత్యధికంగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం, కరీంనగర్ పార్లమెంట్ ఇన్ చార్జి అంకని భానుకు కృతజ్ఞతలు తెలిపారు.