వేద న్యూస్, జమ్మికుంట ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ సోమవారం జమ్మికుంట మండలం నాగరం గ్రామంలోని భక్తాంజనేయ స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం 11వ వార్డులోని పోచమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకున్నారు. బోనం ఎత్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణంతోపాటు మండలంలోని ప్రజలు ప్రణవ్ బాబుకు బ్రహ్మరథం పట్టారు. ప్రజలను ఉద్దేశించి ప్రణవ్ మాట్లాడుతూ ప్రజలే తన బలం అని చెప్పారు. గత పాలకులకు భిన్నంగా హుజురాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని, మీరు ఆశీర్వదిస్తే..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో నియోజకవర్గంలోని ప్రతీ గడపగడపకు చేర్చి మీ రుణం తీర్చుకుంటాను అని ప్రజలకు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ స్కీముల పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ స్కాముల పార్టీ అని దుయ్యబట్టారు. కెసిఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మలుచుకొని కోట్ల రూపాయలు దోచుకున్నాడు అనే దానికి నిదర్శనం ప్రాజెక్టు నిర్మించిన ఐదేళ్లలోనే శిథిలావస్థకు చేరుకోవడమేనని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించి న ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటివరకు చెక్కుచెదరకుండా ఉండి రైతులకు సాగు తాగునీరు అందిస్తున్నాయని స్పష్టం చేశారు. గ్రామాలలోని ప్రజలందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి, ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రణవ్ కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.