•  ఇండ్లకు వెళ్లాలంటే వణుకుతున్న కాలనీవాసులు
  •  ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా స్పందించని వైనం

వేద న్యూస్, కమలాపూర్:

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలోని కాలనీలన్నీ పూర్తిగా చీకటిలో కూరుకుపోయాయి. వీధిదీపాలు వెలగట్లేదని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు వారు పరిష్కారం చూపట్లేదని స్థానికులు ఆరోపిస్తు్న్నారు.

రాత్రిపూట ఏ కాలనీ చూసిన కాలనీ అంతా పూర్తిగా చీకటితో నిండి ఉంటున్నది.ఇక ప్రజలు తమ ఇండ్లకు నైట్ టైమ్‌లో వెళ్లాలంటే భయంతో వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. కాలనీ వీధి దీపాల సంగతి ఇలా ఉంటే..హుజురాబాద్-పరకాల ప్రధాన రహదారి డివైడర్‌పై ఉన్న లైట్లు అయితే సగం కూడా వెలగట్లేదు. గతంలో ఇదే ప్రధాన రహదారిపై ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి మరణించాడు. పూర్తిగా చీకటిగా ఉండి రోడ్డు పక్కకు ఉన్న వ్యక్తి కనిపించక వెనకాల నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందారు. మరిన్ని ప్రమాదాలు జరిగి మరో ప్రాణం పోకముందే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత ఆఫీసర్లు స్పందించి ప్రధాన రహదారి వెంట ఉన్న లైట్లు వెలిగేలా చేసి వాహనదారులకు, అలాగే కాలనీలకు సంబంధించిన వీధిలైట్లను పూర్తిగా ఏర్పాటుచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.