•  పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక, ఓరుగల్లు వైల్డ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థల సంఘీభావం
  • జీవో 55ను రద్దు చేసి..జీవవైవిధ్య ఉద్యానవనాన్నికాపాడాలి: పర్యావరణ వేత్త పిట్టల రవిబాబు

వేద న్యూస్, హైదరాబాద్:
డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న అగ్రి బయో డైవర్సిటీ పార్కును తీసివేసి అక్కడికి హైకోర్టు తెలంగాణ హైకోర్టును తరలించాలని తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 055ను తీసుకొచ్చింది. దానిని వ్యతిరేకిస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు గత కొన్ని రోజులుగా వివిధ రకాలుగా తమ నిరసనను తెలుపుతున్నారు. బుధవారం వారు చేస్తున్న నిరసనకు పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక, ఓరుగల్లు వైల్డ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థలు సంఘీభావం తెలిపాయి.

ఈ జీవోను ఎత్తివేసేంతవరకు తమ మద్దతు విద్యార్థులకు, యూనివర్సిటీ సిబ్బందికి ఉంటుందని తెలిపింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు, పర్యావరణవేత్త పిట్టల రవిబాబు మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయాన్ని కనుక పోగొట్టుకున్నట్లయితే కచ్చితంగా భవిష్యత్తులో వ్యవసాయ రంగం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులకు, విద్యార్థులకు, పరిశోధన విద్యార్థులకు, పాఠశాల బోధనా సిబ్బందికి ఇతర సిబ్బందికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయని అనేక సమస్యలు ఎదురవుతాయని వివరించారు. ప్రపంచ ఫుడ్ సెక్యూరిటీలో ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ముఖ్యమైన వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పేర్కొన్నారు.

ఇక్కడ చదువుతున్న వ్యవసాయ విద్యార్థులు అనేక పరిశోధనల ద్వారా కొత్త వంగడాలను కనిపెట్టి..వ్యవసాయంలో వస్తున్న వివిధ రకాలైన రోగాలకు వారికి వారు అనేక రకాలుగా నిర్మూలించేందుకు ఎన్నో పరిశోధనలు జరుపుతోందని వెల్లడించారు.

అలాంటి ఒక మంచి గొప్ప చరిత్ర గల ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వము తమ అవసరాల కోసము..అందులోని భూమిని లాక్కొని వ్యవసాయ జీవవైవిధ్య ఉద్యానవనాన్ని తీసివేసి దాని స్థానంలో హైకోర్టును నిర్మించాలనే ఆలోచన సరైనది కాదని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాలని, దానికి తమ సంఘీభావం ఉంటుందని పేర్కొన్నారు.

నిరసన సంఘీభావ కార్యక్రమంలో విద్యార్థులు, పరిశోధన విద్యార్థులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్55ను వెనక్కి తీసుకునేంతవరకు తమ పోరాటం ఆగదని విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.