•  పాతికేండ్లుగా హస్తం పార్టీలోనే..
  •  జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేసులో..
  •  ఉద్యమకారుడికే చాన్స్ ఇవ్వాలంటున్న కార్యకర్తలు

వేద న్యూస్, జమ్మికుంట:

విలువలకు తిలోదకాలు ఇచ్చి, పూటకో మాట..రోజుకో పార్టీలో జాయిన్ అయ్యే కొందరు లీడర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వలాభం, పదవుల కోసం పాకులాడుతూ అధికారమే పరమావధిగా వివిధ పార్టీల్లోకి జంప్ అవుతూ..అసలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియక జనాన్నే తికమక పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాగా ఈ కోవకు చెందిన వారిగా కాకుండా పాతికేండ్లకు పైగా ఒకే పార్టీని నమ్ముకుని పార్టీ కార్యకర్తగా మొదలై నాయకులుగా ఉంటూ..జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన పుల్లూరి స్వప్న-సదానందం పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు
పుల్లూరి స్వప్న-సదానందం పేరు వింటే చాలు..వారు కాంగ్రెస్ పార్టీకి కంకణబద్ధులు అని ముక్తకంఠంతో కాంగ్రెస్ వార్గాలు, జమ్మికుంట మండల ప్రజానీకం చెబుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రజలు, పార్టీ పలవరింపుయే పరమావధిగా ఏండ్లుగా హస్తం పార్టీ జెండా మోస్తున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తలవంచకుండా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా నిత్యం జనంలో ఉంటున్నారు.

పోరాటాలే కేంద్రబిందువుగా..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమంలో జమ్మికుంట మండలంలో పుల్లూరి సదానందం తన వంతు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో అప్పటి కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు తప్పుడు కేసులు పెట్టి రౌడీషీటర్ ముద్రవేసి భయభ్రాంతులకు గురి చేసినా బెదరకుండా ముందుకు సాగారు. జమ్మికుంట మండల పరిధిలోని వావిలాల గ్రామాన్ని మండలకేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ మేరకు గ్రామస్తుల సహకారంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగగా, 3 రోజులకు అప్పటి టీఆర్ఎస్ లీడర్లు బలవంతంగా దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్టు చేశారు.

20 ఏండ్ల వయసులోనే కటకటాల్లోకి..
అది 1999లో ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతున్న సమయం. ఆ టైమ్‌లో పీపుల్స్ వార్ మిలిటెంట్లు బ్యాలెట్ బాక్సులో ఇంకు నీళ్లు పోసి ఎలక్షన్స్ రద్దు అయ్యేలా చేశారు. ఆ మరుసటి రోజు వావిలాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవలు జరిగాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కోసం ఖాకీల లాఠీ దెబ్బలు తిని, రెండు రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నాడు సదానందం. అప్పుడు ఆయన వయసు 20 ఏండ్లు మాత్రమే. ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసమే సదానందం పని చేస్తున్నాడని ఆయన అనుచరులు చెప్తున్నారు. చిన్న వయసులోనే పార్టీ కోసం కటకటాల్లోకి వెళ్లిన నిఖార్సైన, మూడు రంగుల జెండా పార్టీ వాది సదానందం. వావిలాలలోని దేశ్‌ముఖ్ అన్నారెడ్డి భూములు పేద ప్రజలకు పంచాలని చేసిన పోరాటంలో సదానందం పాల్గొనగా, అప్పటి గులాబీ సర్కార్ తప్పుడు కేసులు పెట్టి నెల రోజుల పాటు జైలుకు పంపింది. నాడు ఈటల రాజేందర్‌తో కలిసి బాలింతలకు మధ్యాహ్న భోజనం పెట్టించాలని చేసిన పోరాటంలో సదానందం ఉన్నారు. ఇక సదానందం సతీమణి స్వప్న కాంగ్రెస్ కార్యకర్తగా మహిళా విభాగంలో కీలకంగా పని చేశారు. 2014లో వావిలాల ఎంపీటీసీగా ఎన్నికల బరిలో దిగి గులాబీ పార్టీని ఓడించి మండలంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించారు. ప్రజాసం‘క్షేమమే’ ధ్యేయంగా కాంగ్రెస్ పక్షాన ఆ‘నాడు’ బలమైన ప్రశ్నించే గొంతుకగా స్వప్న సదానందం దంపతులు వ్యవహరించారు.

హస్తం పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ
పుల్లూరి స్వప్న సదానందం దంపతులు కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగి మండల పార్టీ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో పార్టీ సదానందం సేవలను గుర్తించింది. 1999లో కార్యకర్తగా మొదలైన సదానందం, 2005లో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా, 2011లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా జాయింట్ సెక్రటరీగా, 2021లో హస్తం జమ్మికుంట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా, 2023లో జమ్మికుంట మండల రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2007లో వావిలాల సర్పంచ్‌గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన సదన్న..2018లో జమ్మికుంట జడ్పీటీసీగా పోటీకి నామినేషన్ వేసినప్పటికీ పార్టీ పెద్దల ఆదేశాల మేరకు విత్ డ్రా చేసుకుని పార్టీ పట్ల ఉన్న కమిట్‌మెంట్ ప్రూవ్ చేసుకున్నారు.

మార్కెట్ చైర్మన్ గిరి కోసం ప్రయత్నాలు
ఇన్నేండ్లు హస్తం పార్టీ కోసం పని చేసి పదవుల గురించి ఏనాడు పరితపించకుండా ప్రజాసేవలోనే నిమగ్నమైన పుల్లూరి స్వప్న-సదానందంకు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గిరి అప్పజెప్పాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు. జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పదవి ఈ సారి ఎస్సీ మహిళా కోటాగా ఖరారైన క్రమంలో ఆ పదవిని అన్ని అర్హతలున్న అసలు సిసలైన కాంగ్రెస్ వాది పుల్లూరి స్వప్న-సదానందంకు ఇవ్వాలని పలువురు అభ్యర్థిస్తున్నారు. స్వప్న సదానందం సైతం చైర్మన్ గిరి కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన నేతకు సముచిత స్థానం ఇవ్వడం ద్వారా ప్రజల్లో పార్టీకి మంచి పేరు రావడంతో పాటు ఏండ్లుగా ఒకే పార్టీని నమ్ముకుని ఉన్న లీడర్లకు న్యాయం జరుగుతుందనే సంకేతాలు పంపినట్టు అవుతుందని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.