వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో క్యూ న్యూస్ కార్యాలయం పై దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులకు తావులేదన్నారు. జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని చెబుతూ కొందరు అందుకు ప్రతీకారంగా క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసి కంప్యూటర్స్ ఫర్నిచర్స్ కిటికీల అద్దాలు ద్వంసం చేయడం సిబ్బందిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దుండగుల దాడిలో ఎమ్మెల్సీ మల్లన్న చేతికి గాయాలు కావడం జరిగిందని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఈ దాడిని తీవ్రంగా ఖండించాలన్నారు. రాష్ట్రంలో బీసీల సమస్యల పైన అనేక ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో బీసీ నాయకులపై టార్గెట్ చేసుకొని ఇలాంటి దాడులకు పాల్పడడం వలన బీసీ ఉద్యమాలు మరింత వుదృతమవుతాయన్నారు. ఇటీవల నాగోలు లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు పాలస్థినాపై ఇజ్రాయిల్ అమెరికా దాడులను నిరసిస్తూ శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న వారిపై బీజేవైఎం కార్యకర్తలుదాడి చేయడాన్ని వెంకట్రాములు మరొక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై బీజేవైఎం గూండాలు చేసిన దాడిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని
వెంకట్రాములు డిమాండ్ చేశారు.