• లోక్‌సభ బరిలో పేదల డాక్టర్
  •  కాంగ్రెస్ వరంగల్ టికెట్ కోసం ప్రయత్నాలు
  •  సామాజిక సేవకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందిన రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
తాను నమ్మిన పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం శక్తి వంచన లేకుండా నిత్యం కృషి చేసిన నేత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ. ఉన్నతమైన వైద్య విద్యను అభ్యసించిన రామకృష్ణ..కాంగ్రెస్ వాదిగా ప్రజల్లో ఉన్నారు. పేదల డాక్టర్ గా పేరొందిన రామకృష్ణ..ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు సుపరిచితులు. కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లోక్ సభ బరిలో నిలిపేందుకు ఆయన పేరును హస్తం పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు పెరుమాండ్ల తన వంతు కృషి చేశారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రానికి చెందిన రామకృష్ణది..మొదటి నుంచి కాంగ్రెస్ నేపథ్య కుటుంబమే. ఫిజియోథెరపిస్ట్ గా ఉన్నప్పటికీ ప్రజలకు విస్తృతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతోనే రామకృష్ణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

విద్యార్థి దశ నుంచే హస్తం పార్టీతో ఆత్మీయ అనుబంధం కలిగిన రామకృష్ణ.. హన్మకొండలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ..ఏఐపీసీ(ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్) వరంగల్ చాప్టర్ తో పాటు ఎస్సీ విభాగం చైర్మన్ గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించిన రామకృష్ణ..ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల ఫోరమ్ చైర్మన్ గా ఉద్యమకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు.

నాన్ పొలిటికల్ జేఏసీ, మెడికల్ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగానూ అప్పట్లో స్వరాష్ట్ర సాధన కోసం రామకృష్ణ పోరాటాలు చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో డిజిటల్ స్క్రీన్ వాహనాలతో విస్తృతంగా పర్యటించిన రామకృష్ణ..అన్ని వర్గాల్లో తనకంటూ ఓ గుర్తింపు, ఆదరణ పొందారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ అధిష్టానం లోక్ సభ బరిలో ఆయన పేరును ప్రథముడిగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.