- ముగిసిన చిరుతల రామయణ నాటక ప్రదర్శన
- మహాఅన్నదానం విజయవంతం
వేద న్యూస్, జమ్మికుంట రూరల్:
జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గత నాలుగు రోజుల నుండి
కళాకారులు చిరుతల రామాయణం ప్రదర్శిస్తున్నారు. ఆ మహా కావ్యం పట్టాభిషేక ఘట్టంతో ఆదివారం ముగిసింది. ఈ రామాయణ మహాకావ్యాన్ని చూడడానికి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 20 ఏళ్ల క్రితం నిర్వహించిన రామాయణం మరల జగ్గయ్యపల్లిలో నిర్వహించడం అనుభూతి కలిగించిందని జనం పేర్కొన్నారు.
అన్నదమ్ములు, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న సంబంధాలను కళ్లకు కట్టినట్లు కళాకారులు చూపించారని కొనియాడారు. బుధవారం ప్రారంభమైన రామాయణ కార్యక్రమం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. పట్టాభిషేక మహోత్సవ అనంతరం కాకతీయ విద్యాసంస్థల అధినేత అవిరినేని సుధాకర్ రావు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టాభిషేకంలో పాల్గొన్న భక్తులు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఆద్యంతం పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వచ్చిన భక్తులు పట్టాభిషేకం మీద కూర్చున్న శ్రీ సీతారామచంద్ర ఆంజనేయ స్వాములకు ఒడి బియ్యం పోసి మొక్కులు అప్పజెప్పుకున్నరు. అనంతరం చిరుతల రామాయణ నిర్వహణకు సహకరించిన వారికి శాలువాతో సన్మానం చేశారు.
కార్యక్రమంలో రామాయణ గురువు బోళ్ల కొమురయ్య, సహాయకుడు పడాల సత్యనారాయణ, రామాయణ కళాకారులు వివిధ గ్రామల నుండి వచ్చిన కళాకారులూ హుస్సేన్, భిక్షపతి, సీత మల్లన్న, మోహన్ రెడ్డి, రాజు, జమ్మికుంట, జగ్గయ్యపల్లి సాంస్కృతిక సమైక్య అధ్యక్ష, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. రామాయణ కళాకారులు వేసిన పాత్రలు ప్రజలను ఆకట్టుకున్నాయి.