వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండగగా నిర్వహించారు. జిల్లా కేంద్రాలతో పాటు వాడవాడల ప్రత్యేక పందిరిలతో అలంకరించి సీతారాముని కళ్యాణం వైభవంగా జరిపారు. పురోహితులు ఆధ్వర్యంలో రామునికి ఒడుగు ధరించి వేదమంత్రాలు నడుమ సీతారాముని కళ్యాణం కమనీయంగా…. రమణీయంగా నిర్వహించారు. సీతారాముని పందిర్ల వద్ద యువత జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రాలతో పాటు వాడవాడలా ప్రజా ప్రతినిధులు సీతారామునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రములు సమర్పించారు. కళ్యాణం అనంతరం బెల్లం మిర్యాలతో తయారు చేసిన ద్రవాన్ని భక్తులు స్వీకరించారు. సీతారాముని కళ్యాణం ముగిసిన తదనంతరం డిజె సౌండ్ లతో మహిళల కోలాట ప్రదర్శనలతో శోభయాత్ర ఘనంగా చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున నుంచే జిల్లా కేంద్రాలతో పాటు పల్లెల్లో పలు దేవాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు సందర్భంగా జనసంద్రంగా మారాయి. సీతారాముని కళ్యాణం సందర్భంగా ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సూర్యాపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామునికి పట్టు వస్త్రములు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీతారాముని పవిత్ర బంధం… భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు సీతరాముని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ఈ సందర్భంగా అభిలాషించారు.

వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో సీతారాముని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు సూరి శర్మ వేదమంత్రాలు నడుమ రామయ్య కళ్యాణం కమనీయంగా జరిపారు. అనంతరం బెల్లం మిరియాలతో తయారుచేసిన తీర్థప్రసాదాలను భక్తులు స్వీకరించారు. సీతారామున్ని పల్లకిలో గ్రామం మొత్తం కలియుగ తిరుగుతూ శోభయాత్ర డిజె సౌండ్ లతో ఘనంగా నిర్వహించారు.