వేద న్యూస్, జిడబ్ల్యూఎంసి :

బిల్ కలెక్టర్లు ప్రణాళిక బద్దంగా వసూళ్లు జరపాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హల్ లో ఆయన రెవెన్యూ, శానిటేషన్ అధికారుల తో ఆస్తి, నీటి, ట్రేడ్ లైసెన్స్ పన్నుల వసూళ్ల పురోగతి పై సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.

ఈ సందర్భం గా కమీషనర్ మాట్లాడుతూ పన్ను వసూళ్లు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం జరగాలని, గత 10 సంవత్సరాలలో వసూళ్ల విధానాల్లో అవలంబించిన పద్ధతులే ప్రస్తుతం పాటిస్తున్నారని,ఇది సరైన విధానం కాదని, పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీస్ లు జారీ చేయాలని ఇదివరకే ఆదేశించిననూ , అనుకున్న స్థాయి లో రెడ్ నోటీసులు జారీ చేయక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

సెక్షన్ 100(2)ప్రకారం డిసెంబర్-జనవరి లోగానే పన్నులు చెల్లించాలని చట్టం లో పేర్కొనడం జరిగిందని, టాక్స్ లు చెల్లించని వారికి నల్లా,ఎలక్ట్రిసిటీ సేవలు నిలిపి వేసే అవకాశం ఉందని ప్రజల్లో అవగాహన కలిగించాలని, పన్నుల వసూళ్ల తీరు పరిశీలన కోసం ఫిబ్రవరి మాసం నుండి ఉన్నతాధికారులు( హెచ్ ఓ డి లు) క్షేత్ర స్థాయి లో పర్యవేక్షణ నిర్వహిస్తారని, పన్ను వసూళ్లు జరిపే క్రమం లో ట్రేడ్ వసూళ్లు జరపాలన్నారు.

ఇప్పటి వరకు 46శాతం మాత్రమే పన్ను వసూళ్లు జరిగాయని, వంద శాతం పన్నుల వసూలు కు కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉన్నదని, ఫిబ్రవరి 15 వరకు కనీసం 20శాతం పన్నుల వసూళ్ల లో పురోగతి ఉండాలని లేనిచో సంబంధిత బిల్లు కలెక్టర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రతి బుధవారం ప్రధాన కార్యాలయం లో రెవెన్యూ మేళా ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, ఇందులో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను రెవిన్యూ అధికారులు వారం లో పరిష్కరించాలని, ప్రతి రోజూ అట్టి దరఖాస్తు ల పరిష్కారం పై తానే స్వయం గా సమీక్ష నిర్వహిస్తానని కమిషనర్ అన్నారు.

ఈ కార్యక్రమం లో అదనపు కమీషనర్ లు అనిసుర్ రషీద్,రవీందర్ యాదవ్,సి ఎం హెచ్ ఓ డా.రాజేష్, డిప్యూటీ కమిషనర్ రవీందర్,ఆర్ ఓ లు యుసుఫో ద్దిన్,సుదర్శన్, షహజాది బేగం,శానిటరీ సూపర్ వైజర్ లు,శానిటరీ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.