•  రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సుధాకర్
  •  నిరుపేద కుటుంబం నుంచి ఉన్నత ఉద్యోగానికి ఎంపికైన విద్యాకుసుమం
  •  సంతోషంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు..సుధాకర్‌కు శుభాకాంక్షల వెల్లువ

వేద న్యూస్, ఆసిఫాబాద్/సిర్పూర్ టీ:
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ కొలువు అంటే ప్రతీ ఒక్కరికి ఒక కల. ఎంతో కృషి ఉంటే తప్ప ప్రభుత్వ కొలువు సాధించలేమని చెప్పొచ్చు. అలాంటిది కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని హుడ్కిలి గ్రామానికి చెందిన కిర్మరె సాయినాథ్-విమలబాయి దంపతుల కుమారుడు కిర్మరే సుధాకర్ ఏకంగా రెండు ప్రభుత్వ కొలువులు సాధించి భళా అనిపించాడు.

గత నెలలో విడుదలైన పీజీటీ ఉపాధ్యాయ నియామకాల్లో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు, తాజాగా విడుదలైన టీజీటీ గురుకుల నియామకాల్లో రాష్ట్ర స్థాయి 7వ ర్యాంకు సాధించాడు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన సుధాకర్..చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదివి రెండు ఉద్యోగాలకి ఎంపికై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. రెండు ఉద్యోగాలు సాధించిన సుధాకర్ కు మండల వాసులు పలువురు శుభాకంక్షలు తెలిపారు.

ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ లో సుధాకర్ పీహెచ్ డీ చేస్తున్నాడు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు తప్పకుండా చేరుకోవచ్చనే నిజాన్ని ఊరికే మాటల రూపంలో కాకుండా..చేతల్లో చేసి చూపించారని, యువతకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారని గ్రామస్తులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ప్రతీ ఒక్కరు సుధాకర్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేసి విజయాల సాధించేందుకు కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు.