•  మౌలిక అవసరాలు, ఉపాధి కల్పనకు తన వంతు కృషి
  •  సామాజికవేత్త వెంకట్ ఇంటికి జనం బాట
  •  హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రాక

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నాయకత్వానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు సామాజికవేత్త సబ్బని వెంకట్. ప్రజల అభివృద్ధికి అవసరమయ్యే పనులు తన శక్తి మేరకు చేస్తూ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. దాంతో వెంకట్ తన స్వగ్రామం సిర్సపల్లికి వస్తారనే సమాచారం తెలియగానే జనం ఆయన ఇంటి బాట పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు సమర్పిస్తున్నారు.

మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సబ్బని వెంకట్ ఇప్పటికే ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సబ్బని వెంకట్ వద్దకు వస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కాకుండా తన వద్దకు వచ్చిన వారందరికీ ఆపన్న హస్తం అందించేందుకు ముందు వరుసలో వెంకట్ నిలబడుతున్నారు.

తన టీం ద్వారా విస్తృతంగా ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. యువతకు ఉపాధి కల్పనకు భరోసానిస్తున్నారు. పిల్లల చదువుకు సంబంధించి విద్యా సంస్థల యజమానులతో మాట్లాడుతూ..ఆరోగ్యం విషయమై ఆస్పత్రుల వారితో మాట్లాడుతూ జనానికి సమస్యల పరిష్కారానికి వెంకట్ భరోసానిస్తున్నారు.

నాయకుడిగా ప్రజలకు విద్య, వైద్యం పరంగా వెంకట్ సాయం అందిస్తుండటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్ అందిస్తున్న సేవలతో అన్ని వర్గాల ప్రజల్లో సానుకూల చర్చ జరుగుతోంది. సామాజికవేత్తగా నిస్వార్థంగా సేవలందిస్తున్న వెంకట్ మాదిరిగా నాయకులు సైతం పనులు చేయాలని పలువురు కోరుతున్నారు.