వేద న్యూస్, వరంగల్ :
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు ,కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీఎం సెంటర్ వరకు జరుగు బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ నగరంలోని గవి చర్ల క్రాస్ జంక్షన్ వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్), భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టియు)ల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్ అధ్యక్షత వహించగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ ,ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తన పది సంవత్సరాల కాలంలో ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించిందని అంటూ ఈ ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకునే సమయంలో దేశ రైతాంగ నాయకులకు ఇచ్చిన హామీలను తుంగలో త్రొక్కిందని వారు విమర్శించారు.
పంటల మద్దతు ధర హక్కు చట్టం, రుణ విమోచన చట్టం, చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు.పైగా విద్యుత్ రంగంలో బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా సంస్కరణ తీసుకువచ్చి , ఆ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు పూనుకున్నదని వారు విమర్శించారు.
దేశ రైతాంగ ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొన్న సమయంలో రైతు నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయలేదు అన్నారు.సంవత్సరానికి కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ఉద్యోగాలు అన్నిటిని రద్దు చేస్తూ ఆ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ కార్మిక ఉద్యోగ వర్గానికి ఉపయోగపడే 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు గా చేసి పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గ శ్రమను దోచుకోవడానికే పెట్టుబడిదారి వర్గాలకు అనుకూలంగా మార్చి వేసిందని వారు వాపోయారు.
దేశ ప్రజల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమై రాబోవు ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి ప్రజల వ్యక్తిగతమైన మత సాంప్రదాయాలను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి హిందూ ఫాసిస్టు విధానాలు అమలు చేస్తూ అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన తెరమీదికి తెచ్చిందని వారు విమర్శించారు.
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ పార్లమెంటు వద్ద కొంతమంది నిరసనకారులు తెలియజేసిన ఆందోళనకు సమాధానం చెప్పలేక వారిపై ఉపా లాంటి నల్ల చట్టాలను ప్రయోగించిందని వారిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ అక్బర్, కృష్ణ, హరిబాబు, కరుణాకర్, సాంబయ్య, లతోపాటు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.