•  హన్మకొండ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ధర్మేంద్ర

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
దళిత, బహుజనుల ఆశాజ్యోతి సావిత్రి బాయి పూలే అని హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల( కో-ఎడ్యుకేషన్ ) ప్రిన్సిపాల్ ఎస్. ధర్మేంద్ర అన్నారు. బుధవారం తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతిని కాలేజీలో ప్రిన్సిపాల్ ఎస్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ ధర్మేంద్ర మాట్లాడారు. కులతత్వం, పురుషాధిక్యత ధోరణి కలిగిన సమాజంలో తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో విద్యను ఆర్జించి, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి మారిందని చెప్పారు.

దళిత, బహుజన స్త్రీ జనోద్ధరణకు, విద్యాభివృద్ధికి కృషి చేసిన మహా సామాజిక విప్లవ కారిణి సావిత్రి బాయి పూలే అని కొనియాడారు. నేటితరం యువత సావిత్రి బాయి పూలే ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరం కృషి చేయాలని వివరించారు.

అనంతరం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో కాలేజీలోని మహిళా అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు ఎన్ రత్నమాల, జిల్లా నాయకురాలు టి.భావణి, దివ్య, ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆర్ మాధవి,బి. విజయ నిర్మల,అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.