•  జాగ్రత్తలే రక్షణ కవచం
  •  ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం
  •  పొంచిన సీజనల్ డిసీజెస్, వైరల్ ఫీవర్ల ముప్పు
  •  వానాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి
  •  అవగాహన, సమయానికి వైద్య సలహా వెరీ ఇంపార్టెంట్

వేద న్యూస్, బ్యూరో:

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో భారీ వర్షాల వల్ల వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, ఇదే క్రమంలో ఆ చల్లదనం వెనక కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల ముప్పు కూడా పొంచి ఉంది. ముఖ్యంగా సీజనల్ డిసీజెస్, వైరల్ ఫీవర్లు, నీటి మూలంగా వచ్చే వ్యాధులు, దోమల ద్వారా వ్యాపించే జబ్బులు పెరిగిపోతాయి. అయితే, ఆయా వ్యాధుల గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవడంతో పాటు అవగాహన కల్పించుకుని చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే పలు రకాల అనారోగ్య సమస్యలను ముందే అడ్డుకోవచ్చని ప్రముఖ వైద్యుడు, ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) హుజూరాబాద్-జమ్మికుంట శాఖ కార్యదర్శి, ‘సంజీవని’ ఆస్పత్రి వైద్యుడు ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వెల్లడించారు. ప్రజెంట్ వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలిపారు.

అలా చేయడం డేంజర్

ప్రస్తుత వానాకాలంలో తేమ (తడి) ఎక్కువగా ఉంటుంది. భారీ వర్షాల వల్ల వాతావరణం కూడా చల్లబడి ఉంటుంది. పరిసరాల్లో ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయి ఉంటుండటం గమనించొచ్చు. ఈ నీరు వల్ల దోమలు ఎక్కువగా పెరుగుతాయి. దీని వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటివి సాధారణంగా వచ్చే చాన్సెస్ ఉంటాయి.

ఇకపోతే కొందరు కొందరు తమకు ఫీవర్ వచ్చినా ఇంట్లోనే మందులు వేసుకుంటూ వేచి చూస్తారు. కానీ, ఇది చాలా ప్రమాదకరం. ఫీవర్ రెండు రోజులకు మించినపుడు, 101 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, దగ్గు, వాంతులు, విరోచనలు ఎక్కువగా (రోజుకు 10-15 సార్లు) ఉన్నపుడు, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం వంటి డీహైడ్రేషన్ లక్షణాలున్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలా చేయడమే మీ ఆరోగ్యానికి మంచిది. లేదంటే అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టవుతుంది.

ఇవీ.. ఫీవర్ లక్షణాలు..

అసలు తమ హెల్త్ ఎలా ఉంది? అనేది తెలుసుకోవడానికి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫీవర్ ఎలా వస్తోంది? వేడి ఎప్పుడెప్పుడు పెరుగుతోంది? అనే దానిని బట్టి మూలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు సాయంత్రమయ్యే సరికి ఫీవర్ పెరగడం, వణకటం, చెమటలు వస్తుంటే.. మలేరియా కావొచ్చు.

తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి ఉంటే డెంగ్యూ కావొచ్చని గుర్తుంచుకోవాలి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వస్తుంటే ‘సీజనల్’ వైరల్ ఫీవర్ కావొచ్చు. ఇక టైఫాయిడ్ అయితే, జ్వరం, కడుపులో అసౌకర్యం, అలసట వంటివి కనిపిస్తాయి ఇవి అనుమానాలు మాత్రమే. కచ్చితంగా తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘చికిత్స కంటే నివారణే మేలు’ అనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని చెబుతున్నారు.

యూజ్ మాస్క్ కంపల్సరీ

ప్రజెంట్ వానాకాలం సీజన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడటం ఉత్తమమే కాదు అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ బయటకు వెళితే బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని సూచిస్తు్న్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటి నుంచే జాగ్రత్తలు మొదలవ్వాలని స్పష్టం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఫ్లూ టీకాతో పాటు న్యూమోనియా టీకాలు కూడా వేయించాలి. దోమలు కుట్టకుండా రిపెలెంట్లు ఉపయోగించాలి. దోమ తెరల్లో నిద్రించాలి. నిల్వ నీరు ఉండే ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి. డ్రై డేను ప్రతిరోజూ పాటిస్తే ఇంకా ఉత్తమమని వెల్లడిస్తున్నారు. నీటిని ఒకే చోట నిలువ ఉండకుండా చూడాలని, అలా జాగ్రత్త వహిస్తే వ్యాధులు దరిచేరవని పేర్కొంటున్నారు.

సమయానికి వైద్య సలహా అతిముఖ్యం: డాక్టర్ ఊడుగుల సురేశ్, ఎండీ జనరల్ ఫిజీషియన్

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే.. అవగాహన, జాగ్రత్త, సమయానికి వైద్య సలహా ఇవే ప్రతిఒక్కరికీ రక్షణ కవచమే కాదు అతి ముఖ్యం కూడా. భారీ వర్షాల వల్ల నీరు ఎక్కువగా నిలిచి ఉండిపోవడం వల్ల పరిసరాల్లో దోమలు పెరిగే చాన్సెస్ ఉంటాయి. ఈ దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తాయి. రాత్రివేళ కాటేసే ‘అనోపే‌లీస్’ దోమ వల్ల మలేరియా వస్తుంది. డెంగ్యూ మాత్రం పగటి పూట కాటేసే ‘ఏడిస్’ దోమ వల్ల వస్తుంది. డెంగ్యూలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవచ్చు. ఇది గమనించకుండా వదిలేస్తే పరిస్థితి విషమించొచ్చు. ఇక డెంగ్యూ అంటే జ్వరం మాత్రమే కాదు. అది ప్రమాదకరంగా మారే చాన్స్ కూడా ఉంది. ప్లేట్లెట్ల స్థాయి గమనించడం, నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా దోమల వల్ల కలిగే వ్యాధుల గురించి గుర్తెరిగి.. దోమలు రాకుండా దోమల తెరలు ఇంటి లోపల అమర్చుకోవడం ఉత్తమం.