- అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ అనితా రెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో ప్రంపంచ దివ్యాంగుల వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సంబురాలకు ముఖ్య అతిథిగా ఆమె హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సంబురాలు షురూ చేశారు. అనంతరం పిల్లలు పాటలు పాడి, డాన్స్‌లు చేసి ఆహూతులను అలరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల వారోత్సవాలు అంటే ముందుగా వారిని గౌరవించాలని, వారి ఎదుగుదలకు చేయూతనివ్వాలని అన్నారు. వారి హక్కులను కాపాడినపుడే అది నిజమైన దివ్యాంగుల సంబరాలవుతాయని చెప్పారు. మానసిక దివ్యాంగుల కు అందరిలాగే వారసత్వపు హక్కు ఉంటుందని కానీ, వారు ఏమి చేసుకుంటారని తల్లిదండ్రులు వారికి మిగతా పిల్లలకు ఇచ్చినట్లు ఆస్తి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అది చాలా తప్పు అని స్పష్టం చేశారు.
తల్లిదండ్రుల తర్వాత వీరు బతకడాని ఆ ఆస్తి ఎంతో భద్రత ఇస్తుందని వెల్లడించారు. ఆస్తి ఉంటే వీరిని చూసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారని, దీనిపై అవగాహన అవసరం అని పేర్కొన్నారు. మానసిక దివ్యాంగత కొంతైనా నిర్మూలన కావాలంటే మేనరికం, దగ్గర సంబంధాలతో పెళ్లి చేయకూడదని వివరించారు. అలాగే గర్భంతో ఉన్న సమయంలో మహిళలు అధిక ఒత్తిడికి గురికాకూడదని పేర్కొన్నారు.
దివ్యాంగుల ఉద్యోగాలలో 3 శాతం రిజర్వేషన్ తప్పక అమలయ్యేలా ప్రభుత్వం చూడాలని కోరారు. దివ్యాంగుల వారోత్సవాల సందర్భంగా దివ్యాంగుల హక్కుల గురించి గ్రామ స్థాయి నుండి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని, అలా చేస్తేనే అవి నిజమైన దివ్యాంగుల వారోత్సవాలని డాక్టర్ అనితా రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో ‘స్పందన’ నిర్వాహకురాలు సుచరిత, హరిత, కళ్యాణ్, పిల్లలు పాల్గొన్నారు.