• ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ వైస్ చైర్ పర్సన్ అనితా రెడ్డి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
మానసిక దివ్యాంగుల పట్ల ప్రేమ, అప్యాయత చూపాలని ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ‘స్పందన’ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో ప్రపంచ మానసిక దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పిల్లలు పాటలు పాడి, డాన్స్‌లు చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను అలరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల ఎదుగుదలకు అందరూ తోడ్పాటును అందించాలని కోరారు.

ప్రేమ, అప్యాయతలతో వారికి చేయూతను ఇవ్వాలని, వారి హక్కులను కాపాడాలని తెలిపారు. మానసిక దివ్యాంగుల కు అందరిలాగే అన్ని హక్కులు ఉంటాయని వెల్లడించారు. మానసిక దివ్యాంగత కొంతైనా నిర్మూలన కావాలంటే మేనరికం, దగ్గర సంబంధాలతో పెళ్లి చేయకూడదని వివరించారు. అలాగే గర్భంతో ఉన్న సమయంలో మహిళ అధిక ఒత్తిడికి గురికాకూడదని స్పష్టం చేశారు.

మానసిక దివ్యాంగులను పిచ్చి వారు అని, ఎగతాళి చేయడం, కట్టివేయడం, కొట్టడం లాంటివి చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. దివ్యాంగుల హక్కుల గురించి గ్రామ స్థాయి నుండి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని డాక్టర్ అనితా రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సంస్థ నిర్వహకురాలు సుచరిత, రాజేందర్ రెడ్డి, హరిత, వసుధ, పిల్లలు పాల్గొన్నారు.