– ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గుండాల
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బీఎస్పీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ గుండాల మదన్ కుమార్ అన్నారు. బీఎస్పీ ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’లో భాగంగా ఆరో రోజు శనివారం ఆయన ఉప్పరపల్లి, కోనాపురం, లింగాపురం, గొల్లపల్లి,గురిజాల గ్రామాలలో ముదిరాజ్ సంఘాలు, కుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంఘాల నాయకులు, కార్యకర్తలు, బీఎస్పీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్ కుమార్ మాట్లాడుతూ ‘రైతుబంధు’ భూస్వాముల పాలిట వరంగా, కౌలు రైతులకు అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. పేద రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ తీసేయడం వల్ల పెట్టుబడి పెరిగి తగిన మద్దతు ధర లభించక వ్యవసాయం కుదేలైందని చెప్పారు.
రైతే రాజు అనేది బూటకపు ప్రచారం
రైతే రాజు అనేది వట్టి బూటకమని, డొల్ల ప్రచారం అని ఆరోపించారు. కేసీఆర్ నిరంకుశ పాలన తో రాష్ట్ర ప్రజలపై ఐదు లక్షల కోట్ల అప్పు భారం పడిందని వివరించారు. బీసీలకు చట్టసభలో సీట్లు కేటాయించుటలో అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విఫలం అని చెప్పారు. ఉద్యమకారుల సంక్షేమానికి ఒక పైసాగాని, నామినేట్ పదవులుగాని కేటాయించని కేసీఆర్…కనీసం ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయలేదని స్పష్టం చేశారు. దగాకోరు ప్రభుత్వం ఇక ఎన్నికలవేళ ఆత్మగౌరవ భవనాల పేరు మీద ఆత్మ ఆశీర్వాద సమ్మేళనాలతో ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. ప్రజలు ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలారా, విద్యార్థులారా, ఉద్యోగులారా, సామాజిక మేధావులారా ఒక్కసారి ఆలోచించండి..మోసపోకండి అని గుండాల పిలుపునిచ్చారు. దోపిడీని ఎదుర్కొనుటకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చారని వివరించారు. ఓటు అమ్ముకుని బానిసలవుదామా? మన జాతి బిడ్డలకిచ్చి బాస్‌లం అవుదామా? అనేది ప్రజలే ఆలోచించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన, బహుజన అభ్యున్నతితో ‘సామాజిక తెలంగాణ’ స్థాపితమే లక్ష్యంగా..బీఎస్పీ ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తోందని వివరించారు. సామాజిక తెలంగాణ కేవలం ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వంలోని బీఎస్పీతోనే సాధ్యం అని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్పీ నేతలు మాసాని రమేష్ , చిత్రపు పుష్పిత లయ, దయాకర్, సాగర్, రాములు, శ్రీకాంత్, జవాజి, లక్ష్మణ్ ముదిరాజ్, ప్రణయ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.