•  డబ్బులు కావాలంటే భిక్షాటన చేసి ఇస్తాం
  •  కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక శివ

వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని 22వ వార్డులో రోడ్డుపైనున్న మ్యాన్ హోల్ సమస్యను పరిష్కరించాలని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక శివ కోరారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేండ్లుగా మ్యాన్ హోల్ సమస్య అలాగే ఉందని చెప్పారు. మ్యాన్ హోల్ రోడ్డుపై ఉండి ప్రమాదకరంగా మారిందన్నారు. కేవలం డబ్బుల సంచులు, పార్టీలు మారడం కోసం ఉన్నంత ఆరాటం కౌన్సిలర్లకు ప్రజల పనులు చేయడంలో లేదని ఆరోపించారు.

ఈ సమస్యను అసలు పట్టించుకునే వారు లేరా? అని అడిగారు. ఒకవేళ సమస్య పరిష్కారానికి డబ్బులే కావాలంటే 12, 23వ వార్డులలోని ప్రతీ ఇంటికి రూ.10 లేదా 20ని భిక్షాటన చేసి వార్డు కౌన్సిలర్ కు ఇస్తామని అన్నారు. ఈ రోడ్డు ద్వారా వెళ్లే స్కూల్ వ్యాన్లు, స్కూల్ పిల్లలకు ఈ మ్యాన్ హోల్ డ్రైనేజీ సమస్య ఇబ్బందికరంగా ఉందని వివరించారు.

ఈ సమస్యను పరిష్కరించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ను కోరారు. జమ్మికుంట మున్సిపాలిటీను కైవసం చేసుకున్న మీరు సమస్యల పరిష్కారంలోనూ ముందుండాలని సూచించారు. మున్సిపాలిటీలో ప్రజా సమస్యల కోసం తాము మాట్లాడుతామని వెల్లడించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాని యెడల తాము భిక్షాటన సమస్య ను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.