- మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలో సుమారు 56 మంది రౌడీషీటర్లు
- అందులో 15 మందికే కౌన్సెలింగ్!..యాక్టివ్‌గా సుమారు 32 మంది
- కొంతమంది రాజకీయ నేతల అండదండలతోనే వారు కౌన్సెలింగ్‌కు రారనే అరోపణలు!
వేద న్యూస్, కృష్ణ :
వరంగల్ నగరంలో కొంతమంది రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లకు కొత్త సీఐలు వస్తే మొదటగా ఆ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఎచ్‌వో పి.మల్లయ్య గురువారం రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే, ప్రతీ సారి నూతనంగా వచ్చిన సీఐలు నిర్వహించే కౌన్సెలింగ్‌కు కొంతమంది రౌడీ షీటర్లు హాజరు కావడం లేదని తెలుస్తోంది. రౌడీషీటర్లు ఎవరైనా సరే కౌన్సెలింగ్‌కు రావాల్సిందేనని బలవంతం చేస్తే..తమకు తెలిసిన రాజకీయ నేతలతో ఫోన్లు చేయించుకుని వారు తప్పించుకుంటున్నారనే అరోపణలు లేకపోలేదు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 56 మంది రౌడీషీటర్లు ఉన్నారు. పోలీసు రికార్డుల ప్రకారం వీరిలో సుమారు 32 మంది యాక్టివ్‌గా ఉన్నారు. వీరంతా ఎక్కడో ఒకచోట ఏదో ఒక అలజడి సృష్టిస్తూనే ఉంటున్నారు. అయితే, ప్రాణనష్టం జరిగిన కేసులు తప్పితే మిగిలిన కేసులు బయటకు రావడం లేదు. యాక్టివ్‌గా ఉన్న రౌడీషీటర్లలో సుమారు 15 మంది నగరంలో కీలకమైన ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలతో కలిసి తిరుగుతున్నారని సమచారం.
ఇక రాజకీయ నేతలు తమ అవసరాల కోసం రౌడీషీటర్లను వాడుకుంటున్నారు. తమ తరఫున ఏదైనా సెటిల్‌మెంట్ చేయాల్సి వచ్చినా, ఎవరినైనా బెదిరించాల్సి వచ్చినా వారినే ఉపయోగిస్తున్నారు. తాము హాజరయ్యే కార్యక్రమాలకు వారిని కూడా వెంట తీసుకువెళుతున్నారు. దీంతో రౌడీషీటర్లు తమకు రాజకీయ నేతల అండదండలు ఉన్నాయని చెలరేగిపోతున్నారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సీఐలు తూతూ మంత్రంగా కాకుండా..రాజకీయ అండదండలతో ఫుల్ యాక్టివ్‌గా ఉన్న రౌడీషీటర్లను సైతం పోలీస్ స్టేషన్ గడప తొక్కేలా చేసి..వారికి ఖాకీ రుచి చూపించాలని పలువురు కోరుతున్నారు. అలా చేయకపోతే సమాజంలో వారిని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో విచ్చలవిడిగా భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తూ చెలరేగిపోతారని, ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ప్రమాదం పొంచి ఉన్నదని అభిప్రాయపడుతున్నారు.