వేద న్యూస్, ఇల్లందకుంట:
ఇల్లందకుంట మండల పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామ పారిశుధ్య కార్మికుడు వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంతో పాటు స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. 15 ఏండ్లుగా గ్రామపంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్న తనను క్రమబద్ధీకరించకుండా అన్యాయం చేశారంటూ బాధితుడు ఆరోపిస్తున్నారు. కాగా, అసలు ఈ క్రమబద్ధీకరణ వెనక గల కథాకమామిషు ఏమిటో.. ఎవరికి ఎరుకనో? అనే టాక్ స్థానికంగా వినబడుతోంది.
తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు ఆత్మహత్యాయత్నం చేయగా, ట్రైనీ ఎస్ఐ దీపక్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని.. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని.. బాధితుడికి హామీనిచ్చారు. కాగా, అసలు క్రమబద్ధీకరణ విషయంలో అధికారులు ఎందుకు జాగ్రత్త వహించలేదనే ప్రజలు అడుగుతున్నారు. అధికారులు, స్థానికంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. క్రమబద్ధీకరణ విషయమై తగు విధంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.