•  నిత్య ‘జన గణ మన’కు శ్రీకారం చుట్టిన పింగిళి ప్రశాంత్‌రెడ్డి
  •  ఏడేండ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం
  •  పట్టణవాసుల గుండెల్లో పోలీస్ ఆఫీసర్ స్థానం పదిలం
  •  ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు జమ్మికుంట పట్టణంలో జాతీయ గీతాలాపన
  •  ఈ ప్రోగ్రాంతో పట్టణానికి కీర్తి.. ఇతర ప్రాంతాల్లోనూ అనుకరణ

వేద న్యూస్, జమ్మికుంట:

‘సొంత లాభం కొంత మానుకుని, పొరుగు వాడికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి..’ అని గురజాడ అప్పారావు రాసిన కవిత అందరికీ సుపరిచితమే.. ఆ పలుకులను ఆదర్శంగా తీసుకున్న పోలీస్ ఆఫీసర్ చేసిన వినూత్న ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోంది. జమ్మికుంట పట్టణంలో పోలీస్ ఆఫీసర్ పింగిళి ప్రశాంత్‌రెడ్డి చేపట్టిన నిత్య ‘జన గణ మన’ కార్యక్రమంపై ‘వేద న్యూస్’ తెలుగు దిన పత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం..

విద్యార్థి దశలో ప్రతి రోజూ జాతీయ గీతాన్ని పాఠశాలలో ఆలపిస్తాం. కానీ, ఆ దశ దాటిన తర్వాత మాత్రం జాతీయ గీత ఆలాపన క్రమంగా తగ్గుతోంది. పంద్రాగస్టు, జనవరి 26న రెండు సందర్భాల్లో మాత్రమే జెండా వందనం సందర్భంగా ఆలపిస్తుంటాం. అలా కాకుండా ప్రతి రోజూ జాతీయ గీతాన్ని ఆలపించాలనే ఉద్దేశంతో జమ్మికుంట పట్టణంలో నిత్య ‘జన గణ మన’ కార్యక్రమానికి అప్పటి సీఐ పింగిళి ప్రశాంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తెలుగు వారైన పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపశిల్పి కాగా, పోలీస్ అధికారి పింగిళి ప్రశాంత్‌రెడ్డి ప్రజల్లో దేశభక్తిని పెంచేందుకు జాతీయ గీత ఆలాపన కార్యక్రమాన్ని ప్రారంభించి తన వంతు కృషి చేశారు.

నిత్య ‘జన గణ మన’కు ఏడేండ్లు
జమ్మికుంట పట్టణంలో నిత్య ‘జనగణమన’ కార్యక్రమాన్ని 2017 ఆగస్టు 15న అప్పటి జమ్మికుంట పట్టణ సీఐ పింగళి ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. జమ్మికుంట పేరును జిల్లాలు రాష్ట్రాలు దాటి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు పట్టణంలో జాతీయ గీతాన్ని ఆలపించడం విధిగా నిర్వర్తించారు. జమ్మికుంట పట్టణంలో జాతీయ గీతాలాపన మొదలైన వెంటనే 59 సెకండ్ల పాటు పట్టణంలోని ప్రజలు ఎక్కడికక్కడే నిలబడి జాతీయ గీతాలాపన చేయడం నిజంగా ఒక మహా యజ్ఞం అని చెప్పొచ్చు.

ప్రశాంత్‌రెడ్డి జమ్మికుంట నుండి బదిలీపై వెళ్లినప్పటికీ ఇక్కడికి వస్తున్న పోలీసులు ఆ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జమ్మికుంట పట్టణ సీఐగా పనిచేస్తున్న వరగంటి రవి ఈ నిత్య జనగణమన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో వర్షాలకు కొన్ని మైకులు దెబ్బతిని పనిచేయకపోతే సీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని సరిచేసి నిత్య ‘జనగణమన’ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పట్టణ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అలవాటు పడ్డ ప్రజలు యథావిధిగా నిత్య జనగణమన కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ పోలీసులకు సహకరిస్తున్నారు.

మదిలో మెదిలిన ఆలోచనకు రూపమిచ్చిన మనసున్న ఆఫీసర్
అక్షరాస్యులతో పాటు నిరక్షరాస్యులకూ జాతీయ గీతాలాపన గురించి అవగాహన నిత్య ‘జన గణ మన’ కార్యక్రమం ద్వారా కలిగింది. రెండు వైపులా పదునున్న కత్తి మాదిరి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ..ప్రజల్లో ఆలోచన రేకేత్తించేలా చక్కటి ప్రోగ్రాం నిర్వహించాలనే ఆలోచన వచ్చింది మొదలు..ఆచరణలో చేసి చూపించారు పింగిళి.

పోలీస్ అధికారిగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూనే జనంతో విస్తృతమైన సత్సంబంధాలు కలిగి..వారిని మంచి వైపు నడిపించేలా అడుగులు వేశారు. జమ్మికుంట పట్టణం పేరును ఆదర్శ పట్టణాల జాబితాలో చేర్చి..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ కీర్తి గడింపజేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 

దేశభక్తికి కేరాఫ్ జమ్మికుంట
దేశభక్తికి ఆలవాలం ‘జమ్మికుంట’ పట్టణం.. ‘‘జమ్మికుంట అంటేనే దేశభక్తులు’’ అనేంతలా పోలీస్ అధికారి ప్రశాంత్‌రెడ్డి మార్చారు. పట్టణ ప్రజలు సైతం పోలీసులకు సహకరిస్తూ..కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జాతీయ గీతాలాపనతో క్రమంగా క్రైం రేటు కూడా తగ్గిందని పోలీస్ అధికారి పింగిళి వెల్లడించారు. స్వాతంత్ర్యం రాక మునుపు నాలుగు గోడల మధ్య దొంగ చాటుగా బ్రిటీష్ వారి ఆంక్షల నేపథ్యంలో జాతీయ గీతాలాపన ఉండేదని కానీ, ఇప్పుడు నడీ రోడ్డు మీద స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ జనం ‘జాతీయ గీతం’ ఆలపిస్తుంటే ప్రతి ఒక్కరి రోమాలు దేశ భక్తితో నిక్కబొడుచుకుని..నర నరాన జాతీయ భావం ఉప్పొంగేలా తన వంతు ప్రయత్నం పింగిళి చేశారు.

సేవా కార్యక్రమాల్లో ముందున్న పింగిళి
పోలీస్ ఆఫీసర్ పింగిళి ప్రశాంత్‌‌రెడ్డి..‘‘సొంత లాభం కొంత మానుకుని ఇరుగు వారి కోసం పాటు పడు..తోడు పడు’’ అనే వాక్యాలను ఆచరణలో పాటిస్తారు. ‘పిరికెడు బియ్యం -పట్టెడన్నం(దోసిటి బియ్యం)’, ‘పుస్తకానికి పునర్జన్మ’ అనే పేర్లతో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జమ్మికుంట పట్టణ పోలీస్ ఆఫీసర్‌గా పని చేసిన టైంలో విద్యా సంస్థల్లోని విద్యార్థుల చేత ప్రతి రోజూ దోసిటి బియ్యం తీసుకొచ్చి.. ఒక చోట కలెక్ట్ చేయించారు.

ఒక నెల తర్వాత పోగైన ఆ బియ్యాన్ని విద్యార్థుల చేతనే అనాథలకు, అవసరమైన వారికి అందించారు. తద్వారా విద్యార్థుల హృదయ మనోఫలకాలపైన చిన్నతనంలోనే సేవా దృక్పథాన్ని నాటే ప్రయత్నం పింగిళి ఆచరణాత్మకంగా చేశారు. పౌరుల్లో దేశభక్తిని నింపుతూ..సేవా కార్యక్రమాలు చేపడుతూ..ఆదర్శ వంతమైన అధికారి బృహత్తర కార్యక్రమాలకు పింగిళి తన వంతు ప్రయత్నాలు చేశారు.

జమ్మికుంట నిత్య జాతీయ గీతాలాపనను ఆదర్శంగా తీసుకుని..ఆ తర్వాత జగిత్యాల, గోదావరి ఖని, మెట్‌పల్లి, హర్యానాలోని బనక్‌పూర్, షోలాపూర్, జమ్మూ కశ్మీర్, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి చోట్లలో నిత్య ‘జన గణ మన’ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం.