•  సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు

వేద న్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మండల రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ 6 వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జెండాను యూనియన్ అధ్యక్షులు తాండ్ర అంజయ్య ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో ‘‘ఫిబ్రవరి 16 సమ్మె ఎందుకు?’’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు పోరాడే సాధించిన 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చి, 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచటం, కనీస వేతన చట్టాన్ని రద్దు చేయడం, సమ్మె హక్కును నిర్వీర్యం చేయడం, పిఎఫ్, బోనస్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలను తొలగించడం, లాంటి చర్యలతో కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే వ్యవస్థను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువస్తోందని తెలిపారు.

ఈ దుర్మార్గపు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను యథా విధిగా కొనసాగించాలని, కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలుగా నిర్ణయించాలని కోరాలన్నారు. పెరుగుతున్న నిత్యవసర సరుకుల వస్తువుల, పెట్రోల్, గ్యాస్,డీజిల్ ధరలను నియంత్రించాలని, వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే విధానం మార్చుకోవాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయకూడదని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరింప చేయాలని, 100 రోజుల పనిని 200 రోజులకు పెంచాలని, రోజుకూలి 600గా నిర్ణయించాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, తదితర 23 డిమాండ్లతో ఫిబ్రవరి 16న సమ్మె చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా ఫిబ్రవరి 16 సమ్మెలో ఈ ప్రాంతంలోని అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమ అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తాండ్ర అంజయ్య, కార్యదర్శిగా నౌవుండ్ల బ్రహ్మచారి, ఉపాధ్యక్షులుగా బండారి తిరుపతి, రవీందర్ విలాస్, బండారి రమేష్, సదయ్య, కోశాధికారిగా, పూసాల సంపత్, కార్యవర్గ సభ్యులు, పోగుల లక్ష్మయ్య తదితరులను ఎన్నుకున్నారు.