= కోరుట్ల పట్టణంలోని ఓ పాఠశాలలో ఘటన
= తల్లిదండ్రుల ఆగ్రహం
వేద న్యూస్, కోరుట్ల:
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోరుట్లలోని గౌతమ్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న సాత్వీక్ అనే విద్యార్థిని మంగళవారం ఉపాధ్యాయురాలు కర్రతో కొట్టినట్లు విద్యార్థి బంధువులు ఆరోపించారు. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో జరిగిన చిన్నపాటి గొడవపై కోపోద్రిక్తురాలైన టీచర్ విద్యార్థిపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో సాత్వీక్ ఎడమచేతి, వీపు భాగంలో తీవ్ర గాయాలు కాగా శరీరంపై రక్తం గడ్డకట్టినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గాయపడిన బాలుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి గొడవ జరిగితే తల్లిదండ్రులకు తెలియజేయాల్సిందిపోయి విచక్షణారహితంగా కొట్టడం సరైంది కాదని ఆరోపించారు. పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా కేవలం క్షమాపణలు చెప్పి విషయాన్ని ముగించేందుకు ప్రయత్నించారని వాపోయారు. విద్యార్థులపై ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.