• హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణ
  • నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్
  •  ఇదేనా ‘ప్రజా పాలన’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్
  • నిందితులను శిక్షించని యెడల కేటీఆర్‌ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేస్తామని హెచ్చరిక

వేద న్యూస్, హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుపై షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు పట్టణంలో సుపారి హత్యకు కాంగ్రెస్ నాయకుడు పొనుగంటి మల్లయ్య.. శ్యాంసుందర్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి ప్లాన్ వేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు పై హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కౌశిక్ కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. జమ్మికుంట కౌన్సిలర్లను పొనుగంటి మల్లయ్య తీసుకువచ్చి ఒక రిసార్ట్ లో దాచారని, వారిపై శారీరకంగా మానసికంగా హింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ విషయం తెలిసి ఇక్కడికి వచ్చిన చైర్మన్ రాజేశ్వర్ రావు పై హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోందని పాడి చెప్పారు.

 

రిసార్ట్ లో దాచిపెట్టిన కొంతమంది కౌన్సిలర్లు తమను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పడంతో..వారిని వెతుక్కుంటూ వచ్చిన వారిపై పొనుగంటి మల్లయ్య వర్గీయులు చంపే ప్రయత్నం చేశారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ‘‘ప్రజా పాలన’’ చేస్తామంటూ మరోవైపు హత్య రాజకీయాలకు తెరతీస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడికి గాయం అయిందని, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు చేతి వేళ్లకు గాయమైందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివరించారు. హత్య యత్నానికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని శిక్షించాలని కోరారు. లేనియెడల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భారీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.