•  ఉస్మానియా వర్సిటీ వీసీ ఆచార్య రవీందర్

వేద న్యూస్, చార్మినార్:
భారతీయ రాజ్యాంగంలోని సంక్లిష్టమైన పారిభాషిక పదాలను, వాటి భావనలను విద్యార్థుల అవగాహనా సౌలభ్యం కోసం పునర్విచించవలసిన అవసరం ఉందని, ఆ దిశగా ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆచార్య రవీందర్ అన్నారు. హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాలలోని రాజనీతి శాస్త్ర విభాగం, కమిషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ, ఢిల్లీ సంయుక్తంగా రెండ్రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ప్రారంభ సభలో బుధవారం ఉస్మానియా వర్సిటీ వీసీ రవీందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పాశ్చాత్య భాషల దృష్టి కోణంలో నుండి రాజ్యాంగంలో పొందుపరచబడిన 4,000 సాంకేతిక పదాలను దేశీయ కోణంలో నుంచి బోధనా యోగ్యంగా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. విజ్ఞాన శాస్త్రాల (సైన్స్) నేపథ్యంలో నుండి వచ్చిన విద్యార్థులు కూడా రాజ్యాంగ విలువలను అర్థం చేసుకొనే విధంగా రాజనీతి శాస్త్రాన్ని రూపొందించుకోవాలని సూచించారు.

అంతర్జాతీయ విజ్ఞానాన్ని స్థానిక భాషల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని, రాజ్యాంగ పీఠికలోని సామాజికన్యాయం, లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద మొదలగు గంభీరమైన పారిభాషిక పదాలకు అర్థవంతమైన సూత్రీకరణలను, వ్యాఖ్యానాలను స్థిరపరిస్తే విద్యావిషయక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

అత్యవసరమైన విషయంపై సదస్సు నిర్వహిస్తున్నందుకు కళాశాల ప్రిన్సిపాల్, సమన్వయకర్త డా.కె.భాస్కర్ ను, ఇతరులను అభినందించారు. సభలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆచార్య ఇ. వెంకటేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని, నైతికతను, రాజ్యాంగ మౌలిక తత్వాన్ని గ్రామీణ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

ఎత్నిక్ డెమోక్రసి ఇన్ లిబరలిజం లాంటి కొత్త పదాలకున్న ప్రాసంగికతను అర్థం చేసుకోవాలని చెప్పారు. ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాల భాస్కర్ అధ్యక్షత వహించిన ఈ సభలో కమిషన్ ఉపసంచాలకులు డా.షహజాద్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు.

రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుండి పాల్గొన్న రాజనీతిశాస్త్ర ఆచార్యులు ఆయా సాంకేతిక సదస్సులలో ఉత్సాహంగా పాల్గొని మాట్లాడుతూ ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సభలో డా.అయిజాజ్ సుల్తానా, డా.విప్లవ్ దత్ శుక్లా, డా.తిరుపతి, డా.శంకర్, డా.పావని, డా.కృష్ణవేణి, డా.శ్రీనివాస్ తదితర ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.