వేద న్యూస్, కమలాపూర్:

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల తహసిల్దార్ మాధవి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే కసర బోయిన గోపాల్ అనే రైతు మే తొమ్మిదవ తేదీన తన తండ్రి పేరుతో ఉన్న మూడు ఎకరాల రెండు గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ కోసం మీ సేవలో చలానా చెల్లించి దరఖాస్తు పెట్టుకున్నాడు. గిఫ్ట్ డీడ్ పని నిమిత్తం తహసిల్దార్ దగ్గరికి వెళ్తే సంబంధించిన పత్రాలు ఏవి చూడకుండా తర్వాత రమ్మని పంపించారు. ఆ తదుపరి పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిన పనిచేయకుండా ధరణి ఆపరేటర్ రాకేష్ కు 30 వేల రూపాయలు అప్పజెప్పాలని అప్పుడే నీ పని చేసి పెడతామని రైతుకు చెప్పడంతో అంత స్తోమత తనకు లేదని చెప్తే చివరకు రూ.6 వేలకు బేరం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు గోపాల్ వరంగల్ అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. స్పందించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని పథకం ప్రకారం రంగంలోకి దిగారు. ఐదు వేల రూపాయల నగదును రైతు గోపాల్ వద్ద నుండి తహశీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా పనిచేస్తున్న రాకేష్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసిల్దార్ మాధవి ఆదేశాల ప్రకారం తాను నగదును తీసుకున్నట్లుగా రాకేష్ తెలిపారని, గతంలో తహసిల్దార్ గా పనిచేసిన ప్రాంతంలో కూడా మాధవి పై కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆ కారణంగానే మాధవి కార్యకలాపాలను ట్రాప్ చేసి పట్టుకున్నట్లుగా వరంగల్ ఏసీబీ డిఎస్పి సాంబయ్య తెలిపారు. లంచం తీసుకున్న తహసిల్దార్ మాధవిని, ధరణి ఆపరేటర్ రాకేష్ పై కేసు నమోదు చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డిఎస్పి తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఇన్స్పెక్టర్లు రాజు, శ్యాంసుందర్, ఎల్. రాజు పాల్గొన్నారు.