- మార్పు కోసం వీఆర్పీకి ఓటేయండి
- ప్రజలకు ఆ పార్టీ హుస్నాబాద్ అభ్యర్థి సందీప్ పిలుపు
- విద్యార్థి లోకం వీఆర్పీకి అండగా ఉండాలని అభ్యర్థన
- క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటేయాలని నియోజకవర్గ పరిధిలో ప్రచారం
వేద న్యూస్, హుస్నాబాద్:
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వీఆర్పీ(విద్యార్థుల రాజకీయ పార్టీ) హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కొంగంటి సందీప్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మార్పు కోసం వీఆర్పీ వైపు చూడాలని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలను కోరారు. గత తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను ఇబ్బందులు పెడుతోందని వివరించారు. గులాబీ పార్టీ ప్రభుత్వం అరాచకాలకు అంతులేకుండా పోయిందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఆ పార్టీకి బుద్ధి చెప్పే సమయంలో ప్రతీ విద్యార్థి మేలుకొని ఆలోచన చేయాలని కోరారు. తొమ్మిదేళ్లుగా విద్యార్థి లోకం కష్టపడుతూనే ఉందని, ప్రతీ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తూనే ఉందని ఆరోపించారు.
తెలంగాణ కోసం ఎక్కువ కష్టపడ్డది విద్యార్థులేనని గుర్తుచేశారు. అయితే, తెలంగాణ వచ్చాక కూడా ఎక్కువ నష్టపోయింది విద్యార్థులేనని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ విద్యార్థి రాష్ట్రంలో, హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్లమీదకు నిరసన తెలిపి..విద్యార్థుల కోసం పోరాడే వీఆర్పీకి మద్దతు తెలపాలని అన్నారు.
విద్యార్థులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సైతం తన స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల కోసం ఆలోచించదని విమర్శించారు. ఫిరాయింపుల పర్వం ఆ పార్టీలో మామూలేనని చెప్పారు. ఈ నేపథ్యంలో మన పిల్లల బంగారు భవిష్యత్ కోసం ప్రజానీకం వీఆర్పీ వైపు చూడాలని, క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటేయాలని కొంగంటి సందీప్ కోరారు. విద్యార్థి లోకంతో పాటు అన్ని వర్గాల ప్రయోజనాల కోసం ముందుకు వస్తున్న తనను ఆదరించి..ఆశీర్వదించాలని సందీప్ హుస్నాబాద్ ప్రజలను అభ్యర్థించారు.