– తూర్పున బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం!
– ప్రజాక్షేత్రంలో సత్సంబంధాలు కలిగిన లీడర్‌‌గా నరేందర్
– లారీ డ్రైవర్ కొడుకు నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నన్నపునేని

వేద న్యూస్, కృష్ణ: (Copyright)

ఆ నియోజకవర్గంలో ఆయన గురించి తెలియని వారు ఎవరూ ఉండబోరు. ఆయనను తమ ఇంటి బిడ్డగా ప్రజలు భావిస్తుంటారు. అంతే ప్రేమతో నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ..వారిని కాపాడుకుంటున్న నాయకుడు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన నేతగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

‘తూర్పు’ ప్రజల ఆశీర్వాదంతో కార్పొరేటర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నరేందర్..వరంగల్ నగర మేయర్‌గానూ సేవలందించారు. ప్రస్తుతం ‘తూర్పు’ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ప్రజాక్షేత్రంలో జనంతో సత్సంబంధాలు కలిగిన లీడర్‌గా ఎనలేని పేరు, ప్రఖ్యాతలు ఆయన సంపాదించారు. ‘‘అన్నా సమస్య వచ్చింది’’ అని ఇంటి తలుపు కొడితే ఏ అర్ధరాత్రి అయినా స్పందించే స్థాయికి ఎదిగిన లీడర్ నన్నపునేని నరేందర్ అని చెప్పుకోవచ్చు.

‘అన్నా’ అని పిలవగానే ‘నేనున్నా’ అనే భరోసాను ప్రజలకు ఎమ్మెల్యే నరేందర్ ఇస్తున్నారు. లారీ డ్రైవర్ బిడ్డగా ప్రజలలో నుంచి వచ్చిన నరేందర్ హేమాహేమీలతో తలపడి రాజకీయంగా ఎదిగారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు కలిగిన నేతను సైతం ఓడించి శాసన సభ్యుడిగా విజయం సాధించారు. ఉద్యమ నేతగా, ప్రజల తరఫున పోరాడే నాయకుడిగా నన్నపునేని నరేందర్ ముందుకు సాగుతున్నారు.

నరేందర్ రాజకీయ ప్రస్థానం
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా రాజకీయంగా చిన్నస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి చట్టసభల్లో అడుగుపెట్టారు. 1995లో అప్పటి ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీలో చేరిన నరేందర్..కల్పలత సూపర్‌బజార్ డైరక్టర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1997లో టీడీపీ డివిజన్ కార్యదర్శి, డివిజన్ అధ్యక్షుడిగా పార్టీకి సేవలందించారు.

2004లో టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, 2005లో గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కార్పొరేటర్ గా రంగప్రవేశం చేశారు. 2008లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేసిన నరేందర్..మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా 2009లో అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరారు.

2010లో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నగర అధ్యక్షుడిగా, 2011లో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా, 2012లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా, 2014లో టీఆర్‌ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా, 2016లో వరంగల్ నగర మేయర్‌గా పదవులు చేపట్టారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్(తూర్పు) శాసనసభ బరిలో నిలిచి నియోజకవర్గ శాసన సభ్యుడుగా గెలుపొందారు.

ప్రొఫైల్:
పూర్తి పేరు: నన్నపునేని నరేందర్
పుట్టిన తేదీ: 05-08-1972
తల్లిదండ్రులు: కాంతమ్మ-నర్సింహమూర్తి
స్వగ్రామం:పెరుకవాడ, వరంగల్
కుటుంబం: సతీమణి-వాణి
కుమారులు: లోకేశ్ పటేల్, మనుప్రీత్ పటేల్