- తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భాస్కర్
వేద న్యూస్, ఎల్కతుర్తి:
యాసంగి పంట సాగు కోసం రైతన్నలు ‘రైతుబంధు’ కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే వారి అకౌంట్లలో ‘రైతుబంధు’ నిధులను జమ చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నిధులు విడుదలకు అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదని స్పష్టం చేశారు.
ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు కూడా వచ్చాయని, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని..అయినప్పటికీ ఇంకా సాయం అందలేదని పేర్కొన్నారు. ‘రైతు బంధు’ సాయం అందక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
కొందరు రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించే పరిస్థితి ఉందని, తద్వారా ఎక్కువ వడ్డీలు చెల్లించే పరిస్థితులు ఉండక అన్నదాతకు ఇబ్బందులుంటాయని చెప్పారు. రైతు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వం వెంటనే సాయం కింద ‘రైతు బంధు’ నిధులను విడుదల చేయాలని కోరారు.