వేద న్యూస్, వరంగల్:

గ్రామాల్లో ఆర్ఎంపిలు, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ పట్టణం శివనగర్ లోని కెపిఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సురేఖ ప్రసంగించారు. స్టేట్ మెడికల్ కౌన్సిల్ కు గానీ హెల్త్ కేర్ రిసోర్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ డిఎ) కు గానీ మరేతర సంస్థకు గానీ ప్రభుత్వ ఆదేశాలు లేకుండా తమ పరిధి దాటి ఆర్ఎంపి, పిఎంపిల పై నిబంధనల పేరుతో చర్యలు చేపట్టడం తగదని మంత్రి సురేఖ సూచించారు. ఎవరో ఒకరు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ వివాదాన్ని అందరికి అంటగట్టి ఆర్ఎంపిలు, పిఎంపిల పై చర్యలు తీసుకోవడం సరైనది కాదని తేల్చి చెప్పారు.

గ్రామాల్లో ఆర్ఎంపిలు అందిస్తున్న సేవలు అమూల్యవైనవని మంత్రి కొనియాడారు. అనుకోని ప్రమాదాలకు గురైనప్పుడు తక్షణ వైద్యసేవల్లో భాగంగా ఆర్ఎంపిలు అందించే సేవలు ప్రాణాలను నిలబెడతాయని చెప్పారు. ఆర్ఎంపిలు పట్టణాల్లోని ప్రైవేట్ హాస్పటల్స్ కు ఎన్నో కేసులను బదిలీ చేస్తూ, ఆ హాస్పటల్స్ మనుగడకు పరోక్షంగా సహకరిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా నాటి కాలానికి, నేటి కాలానికి వైద్య సేవల్లోని మార్పులను మంత్రి సురేఖ ప్రస్తావించారు. ఎవరైనా సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వెళితే ఆర్ఎంపి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషేన్ క్రమశిక్షణా చర్యలు చేపడితే ఎలాంటి మచ్చ లేకుండా వారు తమ వృత్తిని కొనసాగించుకోవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. ఆర్ఎంపి, పిఎంపిలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని అన్నారు.

ఎన్నికల అనంతరం ఆర్ఎంపి, పిఎంపిల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. విద్యావంతురాలు, డాక్టర్ అయిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ప్రజల కోసం పనిచేసే నాయకురాలని, భారీ మెజారిటీతో కడియం కావ్యను గెలపించాలని ఈ సందర్భంగా మంత్రి సురేఖ వారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మామిడి ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి బుద్దె లక్ష్మీనారాయణ, కోశాధికారి బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.