- లాఠీచార్జ్‌లు, కేసులు లెక్కలు చేయని ఉద్యమకారుడు
- కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమానికి ఊతంగా..
- మలిదశ ఉద్యమకారుడిగా డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కీలక పాత్ర
- ‘కాలేజీ టు విలేజి’ ద్వారా గ్రామగ్రామాన ‘తెలంగాణ వాదం’ ప్రచారం
- ఆ‘నాటి’ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా సెల్ టవరెక్కి నిరసన
వేద న్యూస్, జమ్మికుంట:
తెలంగాణ రాష్ట్ర కల సాకారమై పదేండ్లవుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కాళోజీ, యూనివర్సిటీ స్టూడెంట్స్, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాల ప్రజలందరూ ఏకమై పోరు చేయగా ఉద్యమం తారస్థాయికి చేరింది. మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2014లో రాష్ట్రం ఏర్పాటైంది. కాగా రాష్ట్రఏర్పాటులో ముందు వరుసలో నిలిచి రకరకాల కార్యక్రమాలు చేపట్టిన ఉద్యమకారుల పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శనంలో ఉద్యమబాటలో సాగిన ఉద్యమకారుడు డాక్టర్ శ్రీరామ్ శ్యామ్‌పై ప్రత్యేక కథనం..

ఇంటర్‌లోనే ఉద్యమ జెండా ఎత్తుకున్న శ్యామ్
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన శ్రీరామ్ శ్యామ్ ఇంటర్ చదువుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమం జెండా ఎత్తుకొని ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2001లో నాటి టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడిగా, 2003 నుంచి 2006 వరకు మండల అధ్యక్షుడిగా పనిచేశారు. 2006 నుంచి 2007 వరకు టీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో కాకతీయ యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా, 2009 కాకతీయ యూనివర్సిటీ టీఆర్ఎస్వీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 హుజూరాబాద్ సాధారణ ఎన్నికల్లో ‘తెలంగాణ వాదాన్ని’ విద్యార్థులతో కలిసి గ్రామ గ్రామాన వివరించారు.
విద్యార్థుల ‘పొలికేక’కు అధ్యక్షుడిగా..
2009లో కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా నవంబర్ 18 జేఏసీ ఏర్పాటు చేసిన విద్యార్థుల సభలో ప్రారంభ ఉపన్యాసం చేశారు. 2009 నవంబర్ 23న అలుగునూర్ క్రాస్ రోడ్డు వద్ద కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలిస్తున్న సందర్భంలో కేయూ రెండో గేటు వద్ద ధర్నా, రాస్తారోకో చేసిన వారిలో ఉన్నారు. ఆనాడు కేటీఆర్ సహా ఉద్యమకారులందరూ అరెస్టు అయ్యారు. 2010 ఫిబ్రవరి 7న కాకతీయ యూనివర్సిటీలో లక్షలాది మంది విద్యార్థులతో నిర్వహించిన ‘పొలికేక’ సభకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి తొమ్మిదో వార్షికోత్సవ సభలో అమరు వీరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు.

‘మహాగర్జన’కు పాదయాత్రగా తరలి..
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటనను అడ్డుకునే ఘటనలో డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ తీవ్ర గాయాలపాలయ్యారు. 2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ‘బస్సుయాత్ర’కు నాయకత్వం వహించారు. 2010 డిసెంబర్ 16న వరంగల్‌లో జరిగిన ‘మహాగర్జన’కు హుజూరాబాద్ నుంచి హనుమకొండకు పాదయాత్ర చేశారు. 2011 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2012లో తెలంగాణ జేఏసీ కమిటీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు.
అప్పటి సీఎంకు వ్యతిరేకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన
2012లో అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిని రాయినిగూడెంలో అడ్డుకునే సందర్భంలో శ్రీరామ్ శ్యామ్ ప్రముఖ పాత్ర పోషించారు. సెల్ టవర్ ఎక్కి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2013లో విద్యార్థులను ఏకంచేసి ‘తెలంగాణ వాదాన్ని’ గ్రామ గ్రామాన వినిపించేలా ‘కాలేజీ టు విలేజి’ ప్రోగ్రాములు నిర్వహించారు. 2013లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పాలకుర్తి సభలో అడ్డుకున్నారు. ఆ సమయంలో శ్యామ్ గాయాలపాలయ్యారు. 2019లో జమ్మికుంట జెడ్పీటీసీగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొంది, మండల అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారు.

విద్యావేత్తగా, ఉద్యమకారుడిగా పేరు సంపాదించిన శ్యామ్ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. చిన్ననాటి సామాజిక స్పృహ కలిగిన శ్రీరామ్ శ్యామ్ పేద విద్యార్థులకు, ప్రజలకు తన వంతు సాయం చేసుకుంటూ వస్తున్నారు. గ్రామస్థాయి నుంచి యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే టార్గెట్‌గా ఉద్యమ గొంతుకై ముందుకు నడిచారు. వేలాదిమంది విద్యార్థులను ఏకం చేసి ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించారు. ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్‌తో పాటు ఎంతో మంది మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులతో కలిసి ఉద్యమ పోరాటంలో ముందుకు నడిచారు. 2001 నుంచి మొదలుకుని మలిదశ ఉద్యమం లక్ష్యాన్ని ముద్దాడే వరకు డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ పై ఉద్యమ కాలాన దాదాపు 51 కేసులు నమోదయ్యాయి. చాలా సార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. అయినప్పటికీ కేసులకు భయపడకుండా ముందుకు సాగారు.