• ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వాలి.. జర్నలిస్టు బీమా పథకం తేవాలి
  • హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్​యూజే) వినతి

వేద న్యూస్, హైద‌రాబాద్ ప్రతినిధి:
రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హైదరాబాద్ యూనియన్​ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్​యూజే) విజ్ఞప్తి చేసింది. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టు బీమా పథకం తీసుకురావాలని కోరింది. సోమవారం హైదరాబాద్​ చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభలో హెచ్​యూజే కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రం నర్సింగరావు మృతి పట్ల హెచ్ యూజే సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.

అనంతరం హెచ్​యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, బి.జగదీశ్ మాట్లాడుతూ హైదరాబాద్​ నగరంలో ఏండ్ల నుంచి పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్లస్థలాలు అందడం లేదని, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. రైతు, నేతన్న బీమాల బీమా పథకం మాదిరిగా… జర్నలిస్టుల బీమా పథకం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు చాలా ప్రైవేటు హాస్పిటల్స్​లో పనిచేయడం లేదని తెలిపారు.

కాబట్టి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. పత్రికలు, టీవీలకు ఇచ్చే యాడ్స్​ నిధుల్లో జర్నలిస్టుల సంక్షేమానికి ఒకటీ నుంచి రెండు శాతం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంద్భరంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య జిల్లా కమిటీకి మార్గనిర్దేశం చేశారు.

కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్​ రాష్ట్ర కార్యదర్శులు చంద్రశేఖర్, విజయానంద్, హెచ్​యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, ట్రెజరర్ రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగవాణి, ఆఫీస్ బేరర్స్ వీరేష్, సర్వేశ్వర్ రావు , శివశంకర్, రమేష్, మధుకర్, అచ్చిన ప్రశాంత్, నిస్సార్, లలిత, నర్సింహా, సాగర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.